ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం రూ.19వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేస్తే.. రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. మునుగోడు ఉపఎన్నిక ఓ కాంట్రాక్టర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి పనైనా చేశారా? అని ప్రశ్నించారు. ఏ గ్రామానికైనా అభివృద్ధి పనులు కావాలని జిల్లా మంత్రి వద్దకు వెళ్లారా? అని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చండూరులో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్‌కు మునుగోడు కష్టం తెలుసని కేటీఆర్ అన్నారు. మునుగోడు పదేళ్ల ముందు ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలని కోరారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5లక్షల బీమా ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. నల్గొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్యను ప్రధానులు సైతం పట్టించుకోకపోయినా కేసీఆర్ పరిష్కరించారన్నారు. ఇప్పుడు ఉప ఎన్నిక ఎందుకొచ్చిందో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం రూ.19వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేస్తే రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని కేటీఆర్ దుయ్యబట్టారు. రూ.వేలకోట్ల కాంట్రాక్టుల లాభాలతో మునుగోడు ఓటర్లను అంగడి సరకులా కొనేందుకు సిద్ధమైన కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని చెప్పారు. ప్రజలకు అవసరం లేకపోయినా బలవంతంగా రుద్దిన ఎన్నిక ఇది అని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.