Health

TNI HEALTH.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు సంకేతాలు ఇలా..

TNI HEALTH.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు సంకేతాలు ఇలా..

కొన్ని నెలల ముందు నుంచే బ్రెయిన్ స్ట్రోక్ సంకేతాలు!

మనిషి పాలిట ప్రాణాంతకం బ్రెయిన్ స్ట్రోక్

ఇస్కీమిక్, హెమరేజిక్ స్ట్రోక్ లతో ముప్పు

ప్రారంభ లక్షణాలతో అప్రమత్తం అవ్వాలన్న నిపుణులు

శరీరంలో ఏ భాగానికి రక్తప్రసరణ సరిగా జరగకపోయినా అక్కడి కణజాలం దెబ్బతింటుంది. శరీరం మొత్తానికి అంత్యంత కీలక భాగం అయిన మెదడుకు రక్త ప్రసరణ సరిగా లేకపోయినా, మెదడులో రక్తనాళాలు చిట్లిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. ఇది పక్షవాతానికి దారితీయడమే కాదు, ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది.

అయితే, బ్రెయిన్ స్ట్రోక్ సంకేతాలు కొన్ని నెలల ముందు నుంచే కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు చాలా మామూలుగానూ, గుర్తించలేని విధంగా ఉంటాయి. వెర్టిగో (తల గిర్రున తిరగడం), వికారం, కళ్లు తిరిగి పడిపోతుండడం వంటి లక్షణాలను ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రారంభ దశగా భావించాల్సి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్లను సంప్రదించడం మంచిది.

ఇవే కాదు… చేతుల్లో బలం తగ్గడం, కాళ్లు, చేతులతో సహా శరీరంలో ఒక వైపు మొద్దుబారినట్టు అయిపోవడం, మాటలు పలకడంలో తడబాటు, ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి, కంటిచూపు మందగించడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు ముందు హెచ్చరికల వంటివే.

ఈ బ్రెయిన్ స్ట్రోక్… ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అనే రెండు రకాలుగా ఉంటుంది. రక్తనాళాల్లో అడ్డంకుల కారణంగా మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవడంతో ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవిస్తుంది. తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులో మృత కణజాలం పెరిగిపోతుంది.

ఇక రక్తనాళం చిట్లిపోవడం, లేక రక్తనాళం నుంచి లీకేజిల కారణంగా ఏర్పడే బ్రెయిన్ స్ట్రోక్ ను హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ లక్షణాలు స్ట్రోక్ రాకముందు, వచ్చిన తర్వాత కొన్ని వారాలు, నెలల పాటు కొనసాగుతాయని ‘ద స్ట్రోక్ అసోసియేషన్’ పేర్కొంది.

ఇక స్ట్రోక్ సంభవించినప్పుడు ముఖంలో ఓవైపు భాగం లాగుతున్నట్టుగా ఉండడం, మూతి వంకరపోవడం, సరిగా నవ్వలేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేతులు చచ్చుబడినట్టుగా ఉన్నా, నాలుక మడతపడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రందించాలి.