జయలలిత మృతిపై విచారించిన జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ తన నివేదికలో పలువురికి మొట్టికాయలు వేసింది. జయలలితకు బాగోలేదని తెలిసిన వెంటనే ఆమెను వ్యక్తిగత వైద్యుడిగా ఉన్న శివకుమార్ పరీక్షించి ఉండాల్సిందని కమిషన్ అభిప్రాయపడింది. ఇది కమిషన్ దృష్టిలో నిర్లక్ష్యంగా తెలిపింది. అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు ‘సెప్సిస్’పై మాత్రమే దృష్టి సారించి 2016 సెప్టెంబరు 27 అర్ధరాత్రి వరకు దానికి చికిత్సలు అందించారని, ఆమె ఆరోగ్యం క్షీణించడానికి కారణమైన హృద్రోగానికి చికిత్సలు అందించడం మరిచారని తెలిపింది. అపోలోకు ఐదుసార్లు విచ్చేసిన ఎయిమ్స్ బృందం ఎలాంటి చికిత్సలు సిఫారసు చేయలేదని పేర్కొంది. నాటి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ సాక్ష్యం తిరస్కరించేలా, బాధ్యతారాహిత్యంగా ఉండటం బాధాకరమని తెలిపింది.
మెరుగైన చికిత్సలు కోసం జయలలితను విదేశాలకు తీసుకెళ్లకపోవడాన్ని ప్రశ్నించగా… ఆ చర్యలు భారతీయ వైద్యులను అవమానించేలా ఉంటాయని సమాధానం ఇవ్వడంపై విస్మయాన్ని వ్యక్తం చేసింది. అలాంటప్పుడు చికిత్సలు కోసం లండన్ నుంచి వైద్యులను, సింగపూర్ నుంచి ఫిజియోథెరఫిస్ట్‌ను అపోలోకు ఎందుకు రప్పించినట్టని ప్రశ్నించింది. ఆ చర్యలు భారతీయ వైద్యులను అవమానించేలా లేవా? అనీ ప్రశ్నించింది. వెటర్నరీ వైద్యుడైన ఆయన ఆరోగ్యశాఖ కార్యదర్శి అర్హత ప్రాతిపదికన తనను వైద్యుడిగా చెప్పకపోవడమే శ్రేష్టమని వ్యాఖ్యానించింది. జయలలిత పూర్తిగా కోలుకున్నారని, డిశ్చార్జి కావడం ఆమె నిర్ణయంపై ఆధారపడిందంటూ అపోలో ఆస్పత్రి సంస్థల ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి అప్పట్లో విలేకర్లకు వెల్లడించడాన్ని విమర్శించింది. ఆ వ్యాఖ్యలు వాస్తవదూరమనే విషయం విచారణలో తెలిసిందని పేర్కొంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆస్పత్రి ఛైర్మన్ ఇలా మీడియాతో బాధ్యతారాహిత్య అభిప్రాయాన్ని వెల్లడించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపింది. జయలలితను బాగు చేయాలని భావించడం వాస్తవమైతే తొరసిక్ నిపుణులను నియమించి, వారి సూచనల మేరకు చికిత్సలు అందించి ఉంటారని, ఇది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉందని అపోలో ఆస్పత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జయలలితకు నమ్మిన బంటుగా ఉన్న ఓ.పన్నీర్‌సెల్వం సైతం ఆమె మృతిని రాజకీయ లబ్ధికి వాడుకున్నట్టు కమిషన్ అభిప్రాయపడింది.