Politics

కెసిఆర్ ను సై అంటున్న తమిళ సై

కెసిఆర్  ను  సై అంటున్న తమిళ సై

బిల్లులపై తెలంగాణ ప్రభుత్వానికి షాక్‌

నాకు విస్తృత అధికారాలు ఉంటాయన్న గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వర్సెస్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మధ్య పరస్పర విమర్శలపర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గవర్నర్‌ తమిళిసై బహిరంగంగానే కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. గవర్నర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ పలు సందర్భాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు సైతం తమిళిసైపై ఎదురు విమర్శలు కూడా చేశారు. కాగా గవర్నర్‌ తమిళిసై మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తమిళిసై మాట్లాడుతూ ‘అసెంబ్లీ సమావేశాల్లో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా నా పరిధిలోనిది. గవర్నర్‌గా నాకు విస్తృత అధికారాలు ఉంటాయి. నా పరిధికిలోబడే నేను నడుచుకుంటున్నాను. పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. గవర్నర్‌గా నా బాధ్యతను అనుసరించే నిర్ణయాలు వెలువరిస్తానని స్పష్టం చేశారు. అంతకుముందు కూడా గవర్నర్‌ తమిళిసై తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున తనని జెండా ఆవిష్కరించనివ్వలేదని, ప్రసంగం కూడా చేయనివ్వలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ పోతున్నానని అన్నారు. ఏనాడు నేను అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. రాజ్‌భవన్‌లో తనకయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతినెలా తనకయ్యే ఖర్చును తానే సొంతంగా చెల్లిస్తున్నానని, ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకోవడం లేదని పేర్కొన్నారు.