త్రిముఖపోరైనా తప్పని ఆందోళన
జరిగే మేలు ఎవరికి?.. చీలే ఓట్లెవరివి
పార్టీలను భయపెడుతున్న క్రాస్ ఓటింగ్ భయం
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఎక్కువ మంది బరిలో ఉండటం.. అందులోనూ చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉండటంతో ఎవరిపై ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది. వారు ఎవరి ఓట్లను చీల్చే అవకాశం ఉంది, అందువల్ల ఎవరికి లాభం జరుగుతుందనే దానిపై అంచనాల మీద అంచనాలు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారు తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల అందరిలో ఆందోళన కనిపిస్తోంది. క్రాస్ ఓటింగ్ భయం పార్టీలను వేధిస్తోంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఓట్లు చీలిపోకుండా కట్టడి చేసే పనిలో పడ్డాయి. గతంలో చిన్న పార్టీలు, స్వతంత్రులకు ఎన్ని ఓట్లు పడ్డాయి. ఏ మేరకు, ఎవరి ఓట్లను చీల్చగలిగారన్న అంచనాల్లో మునిగిపోయాయి.
త్రిముఖపోరైనా తప్పని ఆందోళన : ఈ ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు జాతీయ పార్టీ అయిన బీఎస్పీ నుంచి ఒకరు కలిపి నలుగురు ఉండగా.. రిజిస్టర్డ్ పారీ్టల అభ్యర్థులు 10 మంది ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందు 83 మంది బరిలో ఉన్నా.. ప్రధాన పార్టీలు 36 మంది స్వతంత్రులను ఒప్పించి బరిలో నుంచి తప్పించగలిగాయి. అయినా పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు పోటీలో నిలిచారు. మొత్తంగా ప్రధాన పారీ్టలు మినహా మిగతా 44 మంది అభ్యర్థులు ఎవరి ఓట్లను చీల్చుతారన్నది కీలకంగా మారింది.
మారిన పరిస్థితుల్లో అంచనాలెలా? : గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ హవా కనిపించినా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ప్రస్తుత ఉప ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్‌కు చెందిన గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులను, ప్రజాప్రతినిధులను వీలైనంత మందిని టీఆర్‌ఎస్, బీజేపీ తమవైపు తిప్పుకొన్నాయి. అయినా పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న స్పష్టత లేదు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏ గుర్తుపై ఎన్ని ఓట్లు పడ్డాయి? క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగిందన్న లెక్కలు తీసుకున్నాయి. ఇక టీఆర్‌ఎస్‌కు ఈసారి సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పారీ్టల ఓటర్లు ఎటువైపు మొగ్గుతారన్నది అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఆ పార్టీ తమ ఓటు బ్యాంకుతోపాటు కాంగ్రెస్ నుంచి వచి్చన నేతలపై ఆశలు పెట్టుకుంది. ఇక బీజేపీ గతంలో రాజగోపాల్‌రెడ్డికి పడిన కాంగ్రెస్ ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. కానీ నాయకులు పోయినా కేడర్ ఉందని, ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ చెబుతోంది.
గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఇవీ : 2018 సాధారణ ఎన్నికల్లో 16 మంది బరిలో ఉన్నారు. పోలైన మొత్తం 1,98,843 ఓట్లలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రాజగోపాల్‌రెడ్డికి 97,239 (48.90 శాతం) ఓట్లు లభించాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 74,687 ఓట్లు (37.56 శాతం), బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 12,725 ఓట్లు (6.40 శాతం) వచ్చాయి. అదే ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన ఇండిపెండెంట్ మంగ వెంకటేశ్ కురుమకు 3,569 ఓట్లు (1.79 శాతం), ట్రక్కు గుర్తుపై ఎస్‌ఎంఎఫ్‌బీ పార్టీ నుంచి బరిలో ఉన్న చిలువేరు నాగరాజుకు 2,279 ఓట్లు (1.15 శాతం) లభించాయి. బీఎల్‌ఎఫ్ అభ్యర్థి గోశిక కరుణాకర్‌కు 2,080 ఓట్లు (1.05 శాతం), నోటాకు 3,086 ఓట్లు (1.55 శాతం) పడ్డాయి. మిగతా అభ్యర్థులందరికీ కలిపి మూడువేలకు పైగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ ఈ లెక్కలను, ప్రస్తుత పరిణామాలను బేరీజు వేసుకుంటున్నాయి.
దొడ్దిదారిన గెలవాలని టీఆర్‌ఎస్ పార్టీ కుట్రలు
ముదురుతున్న మునుగోడు పాలిటిక్స్
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్
మునుగోడు : తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి పొలిటికల్ లీడర్ల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారం ఘర్షణలకు కూడా దారి తీస్తోంది. మూడు పార్టీల నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టీఆర్‌ఎస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా బండి సంజయ్ తాజాగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘మునుగోడులో దొడ్దిదారిన గెలవాలని టీఆర్‌ఎస్ పార్టీ కుట్రలు చేస్తోంది. డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. టీఆర్‌ఎస్ వైఖరిని మునుగోడు ప్రజలు గమినిస్తున్నారు. మునుగోడులో ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నిక. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. కేసీఆర్ అహం దిగాలంటే టీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం జైకేసారం మండలంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. అంతకుముందు కూడా నాంపల్లి మండలంలో తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బీజీపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు
హైదరాబాద్ : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఏ క్షణంలో ఏ పొరపాటు జరుగుతుందోనని వణుకుతున్నారు. విధి నిర్వహణలో ఏ చిన్న పొరపాటు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉండడంతో అధికారుల్లో భయం పెరిగిపోయింది. సరైన అవగాహన లేక ఇద్దరు అధికారులు చేసిన తప్పిదాలపై ఎన్నికల సంఘం తీవ్ర చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తనకు లేని అధికారాలను ఉపయోగించి ఓ అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి కొత్త గుర్తును కేటాయించినందుకు గాను మునుగోడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కేవీఎం జగన్నాథరావుపై ఎన్నికల సంఘం వేటు వేసి కొత్త ఆర్వోను నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జగన్నాథరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. అలాగే ఓ అభ్యర్థికి సంబంధించిన ఓడ (షిప్) గుర్తుకి బదులు పడవ (బోటు) గుర్తును ముద్రించినందుకు గాను చౌటుప్పల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు విధించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మునుగోడు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతల స్వీకరణకు సైతం అధికారులు ఆసక్తి చూపడం లేదని పేర్కొంటున్నాయి. ఎన్నికల నిర్వహణ అంటేనే తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సాధారణ ఎన్నికలకి మించిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని అధికారులు పేర్కొంటున్నాయి. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సీఈఓ కార్యాలయం అధికారులకు ఫోన్ చేసి సలహాలను అడుగుతున్నారు.
మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం
కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు
కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలతో తెలంగాణలో పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు వెళ్లాయి. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య దూరం స్పష్టం బహిర్గతం అవుతోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని టీఆర్‌ఎస్, బీజేపీ చూస్తున్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఇన్ని కుట్రలు చేస్తున్నారు. నిఖార్సైన కాంగ్రెస్‌వాదులు మునుగోడుకు కదిలిరండి. మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేము. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పార్టీలు అడుగడునా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. పవిత్రమైన యాదాద్రిని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడమే దీనికి పరాకాష్ట. మునుగోడు ఆడబిడ్డ అని కూడా చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు తెగబడ్డారు. మన కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేష్టులుగా ఉందామా?. తెలంగాణ నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు తరలిరండి. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం అని పిలుపునిచ్చారు.
ఎదురు చూస్తుంటా..మునుగోడుకు తరలిరావాలి : పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపు
తెలంగాణ నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఉన్నపళంగా కదలి రావాలని, మునుగోడులో కలిసి కదం తొక్కుదామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ఈ క్షణమే మునుగోడుకు తరలిరావాలని, అందరి కోసం ఎదురు చూస్తుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో ఎదిగిన వాళ్లే ఇవాళ అదే పార్టీకి వెన్నుపోటు పొడిచారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ శ్రేణులంతా మునుగోడుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని బీజేపీ , తెరాసలు కుట్ర చేస్తున్నాయని, దుష్టశక్తులన్నీ ఏకమై కాంగ్రెస్‌ను ఒంటరి చేయాలనుకుంటున్నాయని మండిపడ్డారు. సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్‌లను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర పోలీసులు, స్థానిక అధికార గణాన్ని తెరాస విచ్చలవిడిగా వినియోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన యాదగిరి గుట్ట నరసింహస్వామి దేవస్థానాన్ని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడం దీనికి పరాకాష్ఠగా రేవంత్ అభివర్ణించారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు పాల్పడ్డారని రేవంత్ మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుందామా? తెలంగాణ అస్థిత్వానికి ప్రాణం పోసిన తల్లి సోనియమ్మకే ద్రోహం చేస్తుంటే వదిలేద్దామా? పార్టీ ఏం పాపం చేసిందని ఈ కుట్రలు చేస్తున్నారు?’’ అని ఆయన నిలదీశారు. తెలంగాణ నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఉన్నపళంగా కదలి రావాలని, మునుగోడులో కలిసి కదం తొక్కుదామని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా ఈ క్షణమే మునుగోడుకు తరలిరావాలని, అందరి కోసం ఎదురు చూస్తుంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాజగోపాల్‌రెడ్డి మూడున్నరేళ్లు గ్రామాలవైపు చూడలేదు
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
నల్గొండ : మునుగోడు నియోజకవర్గలో ప్రజా సమస్యల పరిష్కారం తెరాసతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని ఉప్పరిగూడ, ముదిరాజ్‌కాలనీలో ఆయన ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ కాంగ్రెస్, భాజపాలపై విమర్శలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడున్నరేళ్లు గ్రామాల వైపు ఆయన చూడలేదని తలసాని ఆరోపించారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను తెరాస ప్రభుత్వం చేపడుతోందన్నారు. బీజేపీ నేతల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూత అందిస్తోందని చెప్పారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తలసాని కోరారు.
చేనేతపై జీఎస్‌టీ రద్దు చేయాలి : కేంద్రానికి ఎర్రబెల్లి పోస్టుకార్డు
హైదరాబాద్ : చేనేత వస్త్రాలపై విధించిన 5శాతం జీఎస్‌టీ రద్దు చేయాలంటూ తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. తెరాస కార్యానిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రారంభించిన పోస్టుకార్డు ఉద్యమంలో భాగంగా ఆయన ఈ లేఖను రాశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంటే కేంద్రం మాత్రం వారి నడ్డి విరిచేలా జీఎస్‌టీ విధించడం అన్యాయమని లేఖలో వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఆధారపడిన చేనేత రంగానికి తగిన సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేనేత రంగంపై జీఎస్‌టీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వన్ని ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు.
చిన్న పార్టీలతో చిక్కులు తప్పవా?
మునుగోడు బరిలో ఇతర పార్టీలు, స్వతంత్రులు
ఉప ఎన్నిక వేదికగా సత్తా చాటే ప్రయత్నాలు
ఇప్పటికే పాదయాత్రల పేరుతో ప్రజల్లోకి నేతలు*
వీరు సాధించే ఓట్లతో ప్రధాన పార్టీలపై ప్రభావం
2018 ఎన్నికల్లో 6.59శాతం ఓట్లు చీల్చిన చిన్న పార్టీలు
13,327 ఓట్లు పొందిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు
తాజా పరిణామాలతో ప్రధాన పార్టీల్లో ఆందోళన
చిన్న పార్టీలు, స్వతంత్రులను బుజ్జగించే ప్రయత్నాలు
ప్రధాన రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్
హైదరాబాద్ : మునుగోడులో మాత్రం గత ఉప ఎన్నికలన్నింటికి భిన్నమైన పరిస్థితి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. హూజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యే. దుబ్బాక ఉప ఎన్నిక త్రిముఖ పోటీలో అనూహ్య ఫలితం. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మూడు పార్టీలు బరిలో ఉన్నా ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముక్కోణపు పోరు కనిపించినా రెండు పార్టీల మధ్యే హోరాహోరీ పోరు సాగింది. కానీ మునుగోడులో మాత్రం గత ఉప ఎన్నికలన్నింటికి భిన్నమైన పరిస్థితి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలతోపాటు పలు చిన్న పార్టీలు బరిలోకి దిగడం, ప్రచారాన్నీ సీరియస్గానే నిర్వహిస్తుండడంతో మునుగోడులో సాధారణ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. కాగా చిన్న పార్టీలకుతోడు స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో బరిలో నిలవడం ప్రధాన పార్టీలకు ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిన్న పార్టీలు, స్వతంత్రులు సాధించే ఓట్లు ఎన్ని? ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరి ఓట్లను అవి చీల్చనున్నాయి? అది ఎవరి అవకాశాలను దెబ్బ తీస్తుంది? అన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి అన్ని ఎన్నికల్లోనూ చిన్న పార్టీల ప్రభావం పెద్దగా లేదు. అయితే ఇటీవలి కాలంలో పలు పార్టీలు కొంత యాక్టివ్ అయ్యాయి.
ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో బీఎస్పీ వీటిలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఒకటి. ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ పొంది బీఎస్పీలో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్ర సారథిగా ఉన్నారు. ఇప్పటికే ఎంతో కొంత ఓటుబ్యాంకు కలిగి ఉన్న బీఎస్పీలో ఈయన చేరడం పార్టీకి సానుకూల అంశమైంది. మునుగోడు ఉప ఎన్నికకు ముందే ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రవీణ్‌కుమార్ రాజకీయ అరంగేట్రం తర్వాత పూర్తిస్థాయి సన్నద్ధతతో పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మునుగోడులో పోటీ చేస్తోంది. తమ అభ్యర్థి ఆందోజు శంకరాచారితో కలిసి ప్రవీణ్‌కుమార్ ప్రచారంలో పాల్గొంటున్నారు. 80 శాతం బీసీ ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో తాము బీసీ అభ్యర్థిని బరిలోకి దించినందున ఆ వర్గం ఓటర్లతోపాటు దళిత, బహుజన ఓటర్ల మద్దతు తమకే ఉంటుందని బీఎస్పీ ధీమా వ్యక్తం చేస్తోంది. పైగా ప్రవీణ్‌కుమార్ ఏడేళ్లపాటు గురుకులాల సంస్థ కార్యదర్శిగానూ సేవలందించడంతో ప్రచారంలో ఆయనతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల పూర్వ విద్యార్థుల సంఘం (స్వేరోస్) సభ్యులు కూడా వివిధ జిల్లాల నుంచి స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో బీఎస్పీ తరఫున పోటీ చేసిన మల్గ యాదయ్య కేవలం 738 ఓట్లను మాత్రమే సాధించినా.. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దీంతో బీఎస్పీతో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
టీజేఎస్ తరఫున బీసీ అభ్యర్థి 2018 ఎన్నికలకు ముందే పురుడుపోసుకున్న ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి (టీజేఎస్) కూడా మునుగోడులో అభ్యర్థిని బరిలోకి దించింది. చండూరు మండలం బోడంగిపర్తికి చెందిన పల్లె వినయ్‌కుమార్ ఈ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఈయన భార్య గతంలో అక్కడ గ్రామ సర్పంచ్‌గా చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈయనకు మద్దతుగా పార్టీ అధ్యక్షుడు కోదండరాం ప్రచారం చేయనున్నారు. చండూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో ఈ పార్టీ కొంత ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మరోవైపు వైస్సార్‌టీపీ పేరిట పార్టీ స్థాపించిన షర్మిల వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలనే లక్ష్యంతో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ, సన్నిహితుడైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఆమె మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం ఉంది. కాగా, చిన్న పార్టీలతో పాటు పెద్దసంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు మునుగోడు బరిలో ఉన్నారు. వీరికి కేటాయించిన గుర్తులు కారు, కమలం గుర్తులను పోలి ఉండటంతో తమకు ఎక్కడ నష్టం జరుగుతుందోనని టీఆర్‌ఎస్, బీజేపీ ఆందోళన చెందుతున్నాయి.
ప్రధాన పార్టీలకు సవాల్ : మునుగోడులో ముక్కోణపు పోటీ జరుగుతుందని అందరూ భావిస్తున్నా చిన్న పార్టీలు సైతం ప్రచారంలో దూసుకెళ్తూ ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నాయి. ముఖాముఖిగా సాగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే చిన్న పార్టీలు, స్వతంత్రులు దాదాపు 6 శాతం ఓట్లను సాధించారు. ఈసారి ముక్కోణపు పోటీలో వీరి ఓట్లశాతం పెరిగితే ప్రధాన పార్టీ గెలుపోటములూ ప్రభావితయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018 ఎన్నికల్లో 90శాతానికి పైగా పోలింగ్ నమోదైన అతితక్కువ నియోజకవర్గాల్లో మునుగోడు కూడా ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో 91.30 శాతం పోలింగ్ నమోదు కాగా, 49 శాతం ఓట్లతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 37 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డి 6.40 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఆరు చిన్న పార్టీలు పోటీచేసి 6207 (3.12%) ఓట్లను సాధించాయి. అలాగే ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు సైతం 4891 (2.46%) ఓట్లను రాబట్టారు. మూడు ప్రధాన పార్టీలను మినహాయిస్తే చిన్నపార్టీలు, స్వతంత్రులు 11,098 (5.58%) ఓట్లను సాధించాయి.అయితే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నుంచి బరిలోకి దిగడంతో ముక్కోణపు పోటీగా మారింది.