Politics

గుంటూరు తెదేపా నేతలకు చంద్రబాబు వార్నింగ్

గుంటూరు తెదేపా నేతలకు చంద్రబాబు వార్నింగ్

ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. జిల్లా విడిపోయిన తర్వాత పార్టీలో సమన్వయం లోపించిందని ఆయన పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేయాలని అధిష్టానం ఆదేశిస్తే ఇన్‌చార్జులు భేటీ కావడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నేతలు ఎందుకు కలిసిపని చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. పార్టీ సభ్యత్వ నమోదులో కొన్ని నియోజకవర్గాల్లో నేతలు వెనకబడి ఉండటంపై ఇన్‌చార్జులను ఆయన ప్రశ్నించారు. సభ్యత్వ నమోదులో ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో గురజాల నియోజకవర్గం ఉందన్నారు. మిగతా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ఎందుకు కావట్లేదని చంద్రబాబు పేర్కొన్నారు. కొంతమంది పోలీసుల వ్యవహారశైలిపై ప్రైవేటు కేసులు పెట్టాలంటే నేతలు ఎందుకు ఫైల్‌ చేయలేకపోతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురజాలలో 4 ప్రైవేట్ కేసులు పెట్టామని యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా కలిసి పనిచేస్తామని జిల్లా నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతి నేత పనితీరును సమీక్షిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తుంటే కొందరు ముందుగానే పోలీసులకు చెప్పి హౌస్ అరెస్ట్ అంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యవహారాలను సహించబోమన్నారు.