Devotional

కార్తీక స్నానం అంటే ఏంటి? ఎలా చేయాలి?

కార్తీక స్నానం అంటే ఏంటి? ఎలా చేయాలి?

సనాతన హిందూ మతం ప్రకారం.. స్నానానికి గొప్ప స్థానం ఉంది. అందులోనూ సముద్ర స్నానానికి, పుణ్యక్షేత్రాల్లో నదీ స్నానానికి కూడా ప్రత్యేక రోజులు ఉన్నాయి. ఇవాళ మనం ఆశ్వయుజ మాసం పౌర్ణమి నుండి కార్తీక మాసం చివరి వరకు చేసే కార్తీక స్నానం గురించి తెలుసుకుందాం. దీపావళి పండుగ రోజున ముగిసే అమావాస్య నుంచి మొదలై కార్తీక మాసం పౌర్ణమి వరకు ఒక నెల పాటు తీర్థ స్నానం చేయడం వలన ఆధ్యాత్మికత పరంగా చాలా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ మాసంలో, సూర్యోదయానికి ముందు రెండు ఘాటీలు అంటే ఒక సుమారు ఒక గంట ముందు చేసే తీర్థస్నానాన్ని కార్తీక స్నానం అంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లడం అసాధ్యమను కుంటే.. పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని ఉపయోగించి స్నానం చేయొచ్చు. అయితే దీనికి ముందు ఒక మంత్ర పఠించాల్సి ఉంటుంది. ‘మహావిష్ణోః అనుగ్రహ ప్రాప్త్యర్థం తీర్థ స్నానం కరిష్యే’ అని జపించి స్నానం చేయాలి. పవిత్ర కార్తీక ప్రాతఃస్నానం కరిష్యే. అని చెప్పి నీళ్ళు వదలాలి.
కార్తీకస్నానం: ఏ మాసానికి లేని ప్రత్యేకమైన ఆచారం తెల్లవారు ఝామున చల్లనీటి స్నానం. దీనివెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. శరత్‌రుతువులో చివరి భాగంలో వచ్చే కార్తీకంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. వర్ష రుతుప్రభావం కనుమరుగై శీతాకాలానికి మధ్య సంధికాలంగా ఉండే సమయం ఇది. ఈ కాలంలో మారిన, మారుతున్న వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసం పూర్వీకులు ఏర్పాటుచేసిన ఆచారం కార్తీకస్నానం. నదుల్లో, సరస్సులు, పారే కాలువలు, జలపాతాలు, బావుల వద్ద స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఇది వీలుకాకపోతే ఇంట్లోనైనా శాస్త్ర ప్రకారం స్నానం ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
కార్తీక మాసంలో ఈ విధంగా స్నానం చేస్తే సర్వపాపాలు నశించి, శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి. నిత్యే నైమిత్తికే కృష్ణకార్తికే పాపనాశ అనే మంత్రం శాస్త్రాలలో ఉంది. అలాగే ఏదైనా మతపరమైన పనుల నిమిత్తం నిత్యం స్నానం చేస్తే బాహ్య పాపాలు నశిస్తాయి. కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల అంతర్గత పాపాలు కూడా నశిస్తాయి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత నుదుటిపై తిలకం పెట్టుకోవాలి.
కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నప్పుడు ఒక మాట గుర్తు పెట్టుకోవాలిట్టుకోవాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యడమంటే పక్కన ఉన్న నదిని వదిలిపెట్టి ఒక్కడో ఉన్న మరో నదిలో స్నానానికి వెళ్ళకూడదు. ఉదాహరణకు, కార్తీక మాసంలో గంగా స్నానం చేయాలనుకుంటే, ముందు దగ్గరగా ఉన్న నదీ స్నానం చేయాలి. ఆ తర్వాతే గంగా స్నానం చేయాలి. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది పక్కన ఉండే నదే! ఎప్పుడైనా ప్రవహించే నదిని గమనిస్తే- అది రకరకాల శబ్దాలు చేస్తూ, సూక్ష్మంగా తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెడుతుంది. ఆ సమయంలో అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అలా వెళ్లిపోయే నది నీరు చంద్రుడి శక్తిని పుచ్చుకుంటుంది.
శాస్త్రాల ప్రకారం ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధరిస్తూ ఉంటుంది. ప్రమాదాలు ఎక్కడున్నాయో ముందే హెచ్చరిస్తుంది. ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ, ఉసిరి చెట్టు రూపంలోనూ ఈ ప్రపంచాన్ని ఆదుకుంటూ ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవటం మంచిదంటారు. కార్తీక మాసంలో చంద్ర కిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీటిని అమృతధారగా మారుస్తుంది. అందువల్ల అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరునికి నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడుమార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరానికంతా చంద్ర కిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది. చంద్ర కిరణాల వల్ల ఓషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. అంటే శరీరానికి అనారోగ్యాలు కలగకుండా కాపాడుతుందన్న మాట.
అంతేకాక, చంద్రస్పర్శ కలిగిన తరువాత మనసు సాత్వికమై, పరమేశ్వరారాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. మనసంటే చంద్రుడే. మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది. ఈ రెండు సాధనాలను ఏకకాలంలో పొందడానికి కార్త్తీక మాసంలో నదీ స్నానం ఉపయోగపడుతుంది. ఈ నదీ స్నానం చేయటానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చెయ్యాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చెయ్యకూడదు. “నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను, ఆ విషయం ఈశ్వరుడికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేనివాడికి నేను పూజ చేయడమేంటి? వాడు సర్వజ్ఞుడేంటి? ” అని కొందరు అనుకోవచ్చు. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే పాపనాశనం అవుతుందో పరమేశ్వరుడు దానినే పలికిస్తాడు. అందుకే -“గంగా కావేరీ యోః మధ్య దేశస్థే, గంగా గోదావరీ యోః మధ్య దేశస్థే ” అని సంకల్పం చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపాలు నశిస్తాయి.