ScienceAndTech

లిజ్‌ట్రస్ ఫోను హ్యాక్ చేసిన రష్యా ఏజెంట్లు

లిజ్‌ట్రస్ ఫోను హ్యాక్ చేసిన రష్యా ఏజెంట్లు

బ్రిటన్‌ మాజీ ప్రధాని లిజ్‌ట్రస్‌ చిక్కుల్లోపడ్డారు. ఆమె వ్యక్తిగత ఫోన్‌ను పుతిన్‌ ఏజెంట్లు హ్యాక్‌ చేసి రహస్యాలను దొంగిలించినట్లు బ్రిటన్‌ పత్రిక కథనం వెలువరించింది. బ్రిటన్‌ మాజీ ప్రధాని లిజ్‌ట్రస్‌ వ్యక్తిగత ఫోన్‌ను పుతిన్‌ కోసం పనిచేసే రష్యన్‌ ఏజెంట్లు హ్యాక్‌ చేశారని ‘డెయిలీమెయిల్‌’ కథనం ప్రచురించింది. ఆ సమయంలో ట్రస్‌ బ్రిటన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మిత్రదేశాలతో చర్చలకు సంబంధించిన కీలక రహస్యాలు రష్యా చేతిలో పడినట్లు ఆ కథనం పేర్కొంది. అంతేకాదు.. ఆమెకు అత్యంత సన్నిహితుడైన క్వాసీ క్వార్టెంగ్‌తో పంపించిన పలు వ్యక్తిగత సందేశాలు కూడా వారికి తెలిసినట్లు వెల్లడించింది. క్వార్టెంగ్‌ ఆ తర్వాత బ్రిటన్‌ ఆర్థిక మంత్రి అయ్యారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి పలువురు విదేశాంగ మంత్రులతో ట్రస్‌ సంభాషణలు, ఆయుధ సరఫరా రహస్యాలు కూడా పుతిన్‌ చేతికి వెళ్లినట్లు భావిస్తున్నారు. ఒక ఏడాది మొత్తం ట్రస్‌ సంభాషణలు, సందేశాలు పుతిన్‌ ఏజెంట్లకు దక్కినట్లు అనుమానిస్తున్నారు. బోరిస్‌ జాన్సన్‌పై ఆమె చేసిన విమర్శలు కూడా వీటిలో ఉన్నాయి. ప్రధాని పదవికి ట్రస్‌ పోటీ చేస్తున్నసమయంలో ఈ హ్యాక్‌ను గుర్తించారు. వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లపై తాము స్పందించమని బ్రిటన్‌ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వం వద్ద సైబర్‌ ముప్పులను ఎదుర్కొనే బలమైన భద్రతా వ్యవస్థ ఉందని చెప్పారు. మంత్రులకు సైబర్‌ భద్రతపై రోజువారీ బ్రీఫింగ్స్‌ ఉంటాయన్నారు. అంతేకాదు వారి వ్యక్తిగత డేటా సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా అవసరమైన సూచనలు కూడా చేస్తామన్నారు.