తెలుగు మూలాలు మరిచిపోరాదని, ప్రభుత్వాలు పట్టించుకోని సందర్భంలో మన తెలుగును మనమే రక్షించుకోవాలని తానా మాజీ అధ్యక్షులు, సాహితీవేత్త డాక్టర్ జంపాల చౌదరి పిలుపునిచ్చారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో శనివారం సాయంత్రం చౌదరి అరుణ దంపతులకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ తానా సంస్థ ద్వారా అమెరికాలోని తెలుగు ప్రజలకు సంక్షేమం అందించడం జరుగుతుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా దేశాల మధ్య దూరం తగ్గిందని, తానా ద్వారా అమెరికాలోని తెలుగు రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అలాగే తుపాకీ సంస్కృతి అక్కడి ప్రజల ప్రాథమిక హక్కుగా తుపాకీ ధరించడం జరుగుతుందని, వ్యతిరేకిస్తే ప్రాథమిక హక్కులు హరించినట్లు అవుతుందని చౌదరి అన్నారు. అలాగే వైద్య భారం అక్కడ ఎక్కువగా ఉంటుందని, వైద్యం ప్రైవేటీకరణ కావడంతో భారం అవుతుందని అంటూ ఆ విషయంలో కూడా అక్కడి తెలుగు ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. అరుణ మాట్లాడుతూ తల్లిదండ్రులతో పాటు తెలుగు భాషను కూడా గౌరవించుకోవాలన్నారు. మండలి బుద్ద ప్రసాద్ అధ్యక్షోపన్యాసం చేస్తూ, తెలుగు కథా సాహిత్యానికి చౌదరి విశేష కృషి చేస్తున్నారని, అమెరికా వెళ్లినా గ్రామీణ సంస్కృతిని మరువలేదని ప్రశంసించారు. సాంకేతిక విజ్ఞానం పెరుగుతుండగా విశాల దృక్పథం కొరబడుతుందని విచారం వ్యక్తం చేశారు. రాజకీయాలు మరింతగా దిగజారుతున్నాయని అందుకు మనుగోడు ఉపఎన్నిక ఉదాహరణ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని, భయం నుండి విముక్తి కావాలని అన్నారు. అనంతరం చౌదరి దంపతులను బుద్ధ ప్రసాద్, మత్తి శ్రీనివాసరావు, మండలి వెంకట్రామ్, కొల్లూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.