Politics

అయ్యన్నపాత్రుడు అరెస్టుపై వివరణ ఇచ్చిన సిఐడి డిఐజి

అయ్యన్నపాత్రుడు అరెస్టుపై వివరణ ఇచ్చిన సిఐడి డిఐజి

ఫోర్జరీ సంతకాలతో 2 సెంట్ల భూమిని అయ్యన్న ఆక్రమించారు- ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్

మీడియా ముందుకు వచ్చిన సీఐడీ డీఐజీ సునీల్ నాయక్
అయ్యన్న, విజయ్, రాజేశ్ లపై తమకు ఫిర్యాదు అందిందని వెల్లడి
2 సెంట్ల భూమిని ఆక్రమించారని ఆరోపణ
అందుకోసం ఫోర్జరీ సంతకాలు చేయించారన్న సునీల్
ఏఈ స్థాయి అధికారితో బలవంతంగా అటెస్టేషన్ చేయించారని వివరణ
నెల రోజుల పాటు ఆరోపణలపై విచారణ చేపట్టినట్టు వెల్లడి
ఆరోపణలన్నీ వాస్తవమేనని విచారణలో తేలిందన్న డీఐజీ
ఐపీసీ 464, 467. 471. 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడి
తెల్లవారుజామున అరెస్ట్ చేశామని వివరణ
అరెస్ట్ సందర్భంగా బల ప్రయోగం జరిగిందన్న సీఐడీ ఉన్నతాధికారి
చట్ట ప్రకారమే నడుచుకున్నామన్న డీఐసీ సునీల్ నాయక్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు…ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అసలు అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ ను ఎందుకు అరెస్ట్ చేశామన్న విషయాన్ని వివరించేందుకు గురువారం మధ్యాహ్నం సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అయ్యన్నపై వచ్చిన ఫిర్యాదు, అందులో ఆయనపై నమోదైన ఆరోపణల గురించి సునీల్ నాయక్ వివరించారు. చట్టప్రకారమే తాము అయ్యన్న, రాజేశ్ లను అరెస్ట్ చేసినట్టు డీఐజీ ప్రకటించారు.

తమది కాని ఓ 2 సెంట్ల భూమిని అయ్యన్నపాత్రుడు… తన ఇద్దరు కుమారులు చింతకాయల విజయ్, చింతకాయల రాజేశ్ లతో కలిసి ఆక్రమించారని సునీల్ నాయక్ చెప్పారు. ఇందుకోసం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్ఓసీని సృష్టించారని ఆయన తెలిపారు. ఎన్ఓసీపై ఏఈ సంతకంతో పాటు సదరు ఇంజినీర్ పనిచేస్తున్న కార్యాలయ సీల్ మూడా నకిలీదేనన్నారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి అధికారి చేత అటెస్టేషన్ కూడా చేయించారని తెలిపారు. ఇందుకోసం సదరు ఏఈని అయ్యన్న తన ఇంటికి పిలిపించి బలవంతంగా అటెస్టేషన్ చేయించారని తెలిపారు.

ఈ వ్యవహారంపై తమకు ఫిర్యాదు అందగా… ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పలుకుబడి కలిగిన రాజకీయ నేత కావడంతో అరెస్ట్ లేమీ చేయకుండానే ఓ ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారితో దాదాపుగా నెల రోజుల పాటు విచారణ చేయించామని సీఐడీ డీఐజీ తెలిపారు. ఈ విచారణలో అయ్యన్న, ఆయన కుమారులపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలిందన్నారు. ప్రస్తుతం వీరు ఆక్రమించిన 2 సెంట్ల స్థలం చింతకాయల విజయ్ పేరిట ఉందన్నారు. విచారణ చేపట్టిన ఇన్ స్పెక్టర్ తమకు ఓ నివేదిక ఇచ్చారన్నారు. ఈ నివేదికలో అయ్యన్న, ఆయన కుమారులపై ఐపీసీ 464, 467. 471. 474, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చంటూ తెలిపారన్నారు. ఈ సెక్షన్ల ఆధారంగా నిందితులకు 10 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉందన్నారు.

ఇక అయ్యన్న, రాజేశ్ లను అరెస్ట్ చేసిన సందర్భంగా పోలీసులు దురుసుగా వ్యవహరించారని, అయ్యన్నపై అధికారులు చేయి కూడా చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నకు కూడా సునీల్ నాయక్ సమాధానం ఇచ్చారు. తామేమీ అర్ధరాత్రి అయ్యన్నను అరెస్ట్ చేయలేదని డీఐజీ తెలిపారు.గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అయ్యన్నను అదుపులోకి తీసుకున్నామన్నారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులకు సహకరించని వారిని బలవంతంగా అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందన్నారు. అయ్యన్న అరెస్ట్ సందర్భంగానూ నిందితుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందని, ఈ క్రమంలో బల ప్రయోగం చేసే అయ్యన్నను అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే ఈ విషయంలో తాము చట్టప్రకారంగానే నడుచుకున్నామని, ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని సునీల్ యాదవ్ తెలిపారు.