యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఈ రాష్ట్ర శాసనసభకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) గురువారం షెడ్యూల్ ప్రకటించింది.రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. డిసెంబరు 1న తొలి దశ పోలింగ్, డిసెంబరు 5న రెండో విడత ఓటింగ్ జరగనుంది. డిసెంబరు 8న ఫలితాలను ప్రకటించనున్నారు.జరాత్ శాసనసభ గడువు 2023 ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. 2017లో జరిగిన ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 99 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరిగి ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భాజపా గట్టిగా ప్రయత్నిస్తోంది. అటు పంజాబ్‌లో అఖండ విజయంతో జోరుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్లో పోటీకి దిగుతోంది. ఇందుకోసం ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. కాంగ్రెస్ కూడా వ్యూహాలు రచిస్తున్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో భాజపా – ఆప్ మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు కన్పిస్తోంది.ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో నవంబరు 12న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబరు 8న కౌంటింగ్ చేపట్టనున్నారు. నిజానికి ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్‌కు కాస్త ముందుగా షెడ్యూల్ విడుదల చేసినట్లు ఈసీ వెల్లడించింది.