రుద్రాక్ష గురించి తెలియని భారతీయులు ఉండరేమో. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన వృక్షాల్లో ఇది కూడా ఒకటి.రుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటాకు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం Elaeocarpus Ganitrus. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు. ఇప్పటికీ వేదాంతులు, గురువులు, పూజారులు లాంటివారు వీటిని ధరిస్తారు. కొంతమంది వీటిని ధరించుట వీలుకాని నియమ నిబంధనలను పాటించనివారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట గమనిస్తూనే ఉన్నాం.
రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. రుద్రాక్షలు అనేవి శివుని కంటి నుంచి జాలువారిన బిందువులు. రుద్రాక్షలు వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీ పురాణం, పద్మ పురాణంలో ప్రధానంగా చర్చించారు.శివపురాణం ప్రకారం రాక్షసరాజైన త్రిపురాసురుడు వరగర్వంతో దేవతలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తుండేవాడు. దేవతలంతా పరమ శివుని మొరపెట్టుకన్నారు. త్రిపురాసుర సంహారం కోసం శక్తిమంతమైన అఘోరాస్త్రం పొందడానికి తీవ్రమైన తపస్సు చేశాడు శివుడు. తపస్సు కోసం సమాధిలోకి వెళ్లిన పరమశివుడు చాలా కాలం తర్వాత కళ్లు తెరిచినప్పుడు కొన్ని అశ్రు బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి రుద్రాక్ష వృక్షాలుగా మొలకెత్తాయని.. ఈ చెట్టు నుంచి వచ్చే ఫలాల్లో బీజాలనే రుద్రాక్షలంటారని చెబుతారు.
ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా రుద్రాక్షకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది శివ భక్తులు మెడలో మాలగా ధరించడం చూస్తూనే ఉంటాం. వీటిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని కొందరి భక్తుల నమ్మకం. అయితే ఇండో వెస్ట్రన్ కల్చర్ లో ఫ్యాషన్ కోసం కూడా రుద్రాక్షలు ధరించేవారి సంఖ్య ఎక్కువ ఉండడంతో వీటికి మరింత ప్రాముఖ్యత పెరిగింది.రుద్రాక్షలలో పలు రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు బాదంకాయ లాగ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుదించుకుని గుండ్రముగా మారుతాయి. దీని మధ్య భాగమున గల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య ఖాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది.
వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యా పరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెప్పబడినది. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని చెబుతారు.
ఏకముఖి ( ఒక ముఖము కలిగినది ) :-
అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా విలువైనది. ఎటువంటి మంత్ర, తంత్ర ప్రయోగాలనైనా తిప్పి కొట్టె శక్తిగలదు. సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును
#ద్విముఖి ( రెండు ముఖములు కలిగినది ) :-
దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు. ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధికల్గును. మనోవ్యాకులతను దూరం చేస్తుంది.
#త్రిముఖి ( మూడు ముఖములు కలిగినది ) :-
దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు సర్పదోష నివారణ అగును.
#చతుర్ముఖి ( నాలుగు ముఖాలు కలిగినవది ) :-
నాలుగు వేదాల స్వరూపం. పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అధికరాణింపు ఉండును మరియు ఏకాగ్రత పెరుగును.
#పంచముఖి ( అయిదు ముఖాలు కలిగినది ) :-
పంచభూత స్వరూపం. బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును మరియు మలబద్దకం నివారణ అగును.
#షణ్ముఖి ( ఆరు ముఖములు కలది ) :-
కార్తీకేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియాను పోగోడుతుంది. ఈ రుద్రాక్ష కుమారస్వామి స్వరూపం, శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.
#సప్తముఖి ( ఏడు ముఖాలు కలిగినది ) :-
కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం. సభావశ్యత, సంపద, కీర్తి , ఉత్తేజం కల్గును.
#అష్టముఖి ( ఎనిమిది ముఖాలు కలిగినది ) :-
విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.
#నవముఖి ( తొమ్మిది ముఖాలు కలది ) :- నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి. రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరించవచ్చు.
#దశముఖి ( పది ముఖాలు కలిగినది ) :-
దశావతార స్వరూపం. శ్రీ మన్నారాయణుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా కలుగు కష్టములు, సమస్యలు నివారణ అగును.
#ఏకాదశముఖి ( పదకొండు ముఖాలు కలిగినది ) :-
ఇది శివాత్మకమైన రుద్రాక్ష. వైవాహిక జీవితంలో ఆనందమునకు, గర్భ సంబంధ రోగాలకు అనుకూలత లభించును.
పూజలలో రుద్రాక్షలు
రుద్రాక్షలను 108 గాని, 54 గాని, 27 గాని బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి మెడలో ధరించవలెను. జప మాలగా కూడా ఉపయోగించవచ్చును.
వైద్యంలో రుద్రాక్షలు
రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును.
వ్యాపారంలో రుద్రాక్షలు
మనదేశంలో ప్రతీ సంవత్సరమూ 300 కోట్ల రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని హీలింగ్ మాట్రిక్స్ అనే సంస్థ 7 జూలై 2011 నాడు తెలిపింది. స్మగ్లర్లు నకిలీ రుధ్రాక్ష మాలలు ఎర్ర చందనం దుంగలనుండి తయారు చేస్తారు. ఇంకా కొంతమంది మోసగాళ్ళు రేగుపండ్లలోని గింజలకు రంగులు అద్ది రుద్రాక్ష అని అమాయక జనాలకు అంటగడతారు. మరి కొంత మందైతే చెక్క పొత్తుతో రుద్రాక్ష ఆకారంలో మౌల్ద్ చేసి రంగులు వేసి ఏకముఖి లేదా ముఖ్యంగా మార్కెట్ లో వేటిని డిమాండ్ ఎక్కువగా ఉన్నాయో వాటిని నకిలీవి తయారు మోసగిస్తున్నారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు.సాధారణంగా రుద్రాక్ష మొక్కలు హిమాలయ ప్రాంతాల్లో ఉండడం మనం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో ఢిల్లీ యూనివర్శిటీ పరిసరాల్లో కూడా వీటిని గుర్తించారు. ఇంట్లోకూడా పెంచుకోవచ్చు.