Movies

పేరు వాడాల్సిన అవసరం లేదు

పేరు వాడాల్సిన అవసరం  లేదు

నటిగా టబుకు మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. బాలీవుడ్‌లోనే కాదు దక్షిణాదిలో కూడా ఇప్పుడు ఆమెకు మంచి వేషాలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘భూల్‌ భూలయ్య 2’ లో టబు పాత్ర బాగుందనీ, ఆమె బాగా చేసిందనీ ప్రశంసలు వచ్చాయి. అలాగే ఈ నెల 18న విడుదల కానున్న ‘దృశ్యం 2’లో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తున్నారు టబు.

గతంలో ఎప్పుడో టబుతో నటి సిమీ గ్రేవాల్‌ చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన గురించి టబు ఎంతయినా మాట్లాడుతుందని కానీ తన వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా తండ్రి గురించి, ఫ్యామిలీ గురించి ఎప్పుడూ చెప్పలేదు. చిన్నతనంలోనే తల్లితండ్రులు విడాకులు తీసుకోవడంతో తండ్రి ప్రస్తావనే టబు తీసుకురారు. కానీ ఆ ఇంటర్వ్యూలో ఆ వివరాలన్నీ చెప్పడంతో అది వైరల్‌ అయింది.

టబు పూర్తి పేరు తబసమ్‌ ఫాతీమా హష్మీ.. అయితే హష్మీ అనేది తండ్రి ఇంటి పేరు కావడంతో ఆ పదాన్ని తన పేరు నుంచి తొలగించారు టబు. ‘ ఆ పదాన్ని నేను ఎప్పుడు వాడలేదు. మా నాన్న ఇంటి పేరు అంత ముఖ్యమని కూడా అనుకోలేదు. స్కూల్‌ రికార్డ్స్‌లో కూడా ఫాతిమా అన్నది నా ఇంటి పేరుగా ఉంటుంది. తబుసమ్‌ ఫాతీమా.. ఈ పేరుతోనే పెరిగాను. మా నాన్న జ్ఞాపకాలు ఏవీ నాతో లేవు. మా చెల్లెలు అప్పుడప్పుడు ఆయన్ని కలిసిదే కానీ నేను ఆ పని చేయలేదు. నా అంతట నేను పెరిగాను. నా కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలిగాను’ అని ఆ ఇంటర్య్వూలో చెప్పారు టబు.