Business

ట్విటర్‌లో ఉద్యోగాలు ఉఫ్‌

ట్విటర్‌లో ఉద్యోగాలు ఉఫ్‌

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లిన ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌లో ఉద్యోగాలు గల్లంతు అవుతున్నాయి. కొత్త యజమాని మస్క్‌ ఆదేశాల మేరకు భారత్‌ సహా ప్రపంచవ్యాప్త కార్యాలయాల్లో కంపెనీ భారీ స్థాయిలో ఉద్వాసనలను ప్రారంభించింది. భారత్‌లో కంపెనీ కోసం 230 మందికి పైగా పనిచేస్తుండగా.. అందులో దాదాపు 180 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఇంజనీరింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌, పాలసీ.. ఇలా అన్ని విభాగాల్లోనూ భారీగా తీసివేతలకు పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ విభాగాల్లోనైతే అందరికీ ఉద్వాసన పలికినట్లు వారు వెల్లడించారు. ఉన్నపళంగా ఉద్యోగం కోల్పోయిన భారత ఉద్యోగులకు కంపెనీ పరిహారం చెల్లిస్తుందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ట్విటర్‌లో మొత్తం 7,500 మందికి పైగా సిబ్బంది పనిచేస్తుండగా.. అందులో సగం (దాదాపు 3,738) మంది ఉద్యోగం కోల్పోవచ్చని సమాచారం.
**టేకోవర్‌ చేసిన కొన్ని గంటలకే సీఈఓ తొలగింపు:
ట్విటర్‌ను మస్క్‌ 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశారు. గత వారంలో కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్న కొన్ని గంటల్లోనే ఉద్యోగాల కోతలకు శ్రీకారం చుట్టారు. తొలుత సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ గద్దె, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎ్‌ఫఓ) నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌ను తొలగించారు. వారితో పాటు పలువురు ఉన్నతోద్యోగులు గడిచిన కొన్ని రోజుల్లో ట్విటర్‌కు గుడ్‌బై చెప్పారు. కంపెనీని ఆర్థికంగా నిలబెట్టడంతో పాటు 4,400 కోట్ల డాలర్ల భారీ డీల్‌ను లాభసాటిగా మార్చుకునేందుకు మస్క్‌ నిర్వహణ వ్యయాలు తగ్గించుకునే చర్యలు ప్రారంభించారు. ఆ ప్రణాళికలో భాగంగానే సాధారణ సిబ్బంది కోతలు మొదలు పెట్టారు. అంతేకాదు, ట్విటర్‌ తన ఖాతాదారుల నుంచి బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ కోసం నెలకు 8 డాలర్లు (దాదాపు రూ.660) రుసుము వసూలు చేయనున్నట్లు ఈ వారంలో ప్రకటించింది.
*భవిష్యత్‌ అగమ్యగోచరం‘‘కంపెనీలో తీసివేతలు మొదలయ్యాయి. నా సహోద్యోగుల్లో కొందరుఈ-మెయిల్‌ ద్వారా ఇప్పటికే సమాచారం అందుకున్నార’’ని ట్విటర్‌ ఇండియా ఉద్యోగి ఒకరు తెలిపారు. భారత టీమ్‌లో చాలామందికి కంపెనీ ఉద్వాసన పలికిందని మరో వ్యక్తి వెల్లడించారు. ఇండియాలో తీసివేతలపై పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై కంపెనీ ఇంకా స్పందించాల్సి ఉంది. ‘‘ట్విటర్‌ను లాభసాటి బాటలో నడిపించేదుకు, నేడు ప్రపంచవ్యాప్తంగా సిబ్బందిని తగ్గించుకునే క్లిష్టమైన ప్రక్రియను అమలు చేస్తాం. సిబ్బందిలో ప్రతి ఒక్కరికీ తమ ఉద్యోగ పరిస్థితిపై ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తాం. ఉద్యోగులతో పాటు ట్విటర్‌ సిస్టమ్స్‌, కస్టమర్‌ డేటా భద్రత దృష్ట్యా అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నాం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉండి ఉంటే లేదా మార్గం మధ్యలో ఉంటే దయచేసి ఇంటికి తిరిగి వెళ్లిపోండ’ని సిబ్బందికి కంపెనీ గురువారం సమాచారం పంపింది.
దాంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారని, భావోద్వేగాన్ని తట్టుకోలేక కొందరు కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. ఉద్యోగం ఉందా..? ఊడిందా..? అన్న సమాచారాన్ని శుక్రవారం రాత్రి 9.30 గంటలకు (భారత కాలమాన ప్రకారం) ఈ-మొయిల్‌ ద్వారా తెలియజేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీకి సంబంధించిన గోప్యతా సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు లేదా మీడియా లేదా మరెవరితోనూ చర్చించవద్దని ఉద్యోగులను ట్విటర్‌ హెచ్చరించింది.
**అమెరికన్‌ కోర్టులో దావా
ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారీగా తీసివేతలకు పాల్పడిన ట్విటర్‌పై అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో గురువారం క్లాస్‌ యాక్షన్‌ లా సూట్‌ (దావా) దాఖలైంది. ఇదివరకే ఉద్వాసనకు గురైన అమెరికా కార్యాలయంలోని ఐదుగురు ఉద్యోగులు ఈ లా సూట్‌ ఫైల్‌ చేశారు. ఇది అమెరికా ప్రభుత్వ, కాలిఫోర్నియా రాష్ట్ర కార్మిక చట్టాల ఉల్లంఘనేనని వారన్నారు. అమెరికా ప్రభుత్వ ‘వర్కర్‌ అడ్జె్‌స్టమెంట్‌ అండ్‌ రీట్రైనింగ్‌ నోటిఫికేషన్‌’ (డబ్ల్యూఏఆర్‌ఎన్‌) యాక్ట్‌ ప్రకారం.. సామూహిక తొలిగింపులకు పాల్పడే బడా కంపెనీలు ఉద్యోగులకు కనీసం 60 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.