DailyDose

బతుకు తెరువు ముందు భయాలన్నీ బలాదూరే!

బతుకు తెరువు ముందు భయాలన్నీ బలాదూరే!

మనిషి చివరి మజిలీ శ్మశానంలో ముగుస్తుంది. ఆ భౌతిక కాయానికి దహనం, పూడిక వంటి పనులు ఎక్కువగా మగవాళ్లే చేస్తారు. కాని ఇప్పుడు ఈ పనులను ఆడవాళ్లు కూడా చేస్తున్నారు. భౌతికకాయాన్ని చూడటానికే దగ్గరకు వెళ్లేందుకు కొంతమంది భయపడతారు. అటువంటిది మరియమ్మ, ప్రమీల, సుధారాణి ప్రతిరోజూ శ్మశానికి వచ్చే శవాలను దగ్గరుండి దహనం చేస్తున్నారు. కుటుంబం కోసం ఆడవాళ్లు ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. ఈ ముగ్గురి జీవితాలూ అందుకు నిదర్శనం.
విజయవాడలో కృష్ణలంకకు చెందిన మరియమ్మ (38) పుట్టి, పెరిగింది అంతా శ్మశానం పరిసర ప్రాంతంలోనే. బస్టాండ్‌ ఎదురు స్వర్గపురి రోడ్డులో ఓ ప్రయివేటు ట్రస్టు ఏర్పాటు చేసిన శ్మశానంలో ఈమె పది ఏళ్లుగా పనిచేస్తోంది. ఆమె తండ్రి శ్మశానంలో గుంటలు తీసేవారు. తల్లి చిలకమ్మ అప్పుడప్పుడు అతడి వెంట వెళ్లి పనిలో సహాయం చేసేది. అందుకుగానూ వీరికి వచ్చే రెండు, మూడు వందలతో బియ్యం తెచ్చుకుని తినేవారు. లేదంటే పస్తు పడుకునేవారు. మరియమ్మ తోబుట్టువులు మొత్తం ఐదుగురు. మరియమ్మ బాల్యంలో తల్లితో కలిసి శ్మశానం దగ్గరకు వెళుతూ ఉండేది. సమాధుల మధ్యనే ఆడుకునేది. కొన్నాళ్లకు తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం మరియమ్మ, తల్లి చిలకమ్మ మీద పడింది. దాంతో చిలకమ్మ శ్మశానం బయట నివాసం ఉంటూ వాచ్‌మెన్‌గా, శ్మశానవాటికలో పనిచేస్తూ పిల్లల్ని పోషించింది.

తల్లి మృతితో ఒంటరినయ్యా …
కొన్నేళ్ల క్రితం స్వర్గపురిలోని సమాధులను పగలగొట్టి, పరిసర ప్రాంతం మొత్తం శుభ్రం చేసింది ఓ ప్రయివేటు దహన సంస్థ. మృతుల కుటుంబ సభ్యులు కర్మకాండలు జరుపుకునేలా నాలుగు గదులు, ఒక పెద్ద హాలు నిర్మించారు. చిలకమ్మ, మరియమ్మ కుటుంబం అక్కడే ఉండేలా ఒక గది కట్టించారు. నెలకు రూ.5500 ఇవ్వసాగారు. వాటితోనే పొట్ట నింపుకుని పిల్లల్ని చదివించింది మరియమ్మ. కాని ఆమె భర్త మద్యానికి బానిసై ఇద్దరు పిల్లల్ని, మరియమ్మను వదిలి వెళ్లిపోయాడు. దాంతో తల్లి చిలకమ్మ మరియమ్మ కుటుంబానికి అండగా నిలిచింది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ మృతదేహాల వద్ద పూలదండలు తీయడం, శవాన్ని ట్రాలీలో ఎత్తుకుని మార్చిరీలోకి పెట్టడం చేసేవారు. వారికి ఇద్దరు మగవాళ్లు కూడా సాయం చేసేవారు.

కోవిడ్‌ సమయంలో వివక్ష
‘మేము శ్మశాన వాటికలో పనిచేస్తున్నామని తెలిసి కోవిడ్‌ సమయంలో కిరాణా షాపుల దగ్గరకు రానివ్వలేదు. కనీసం పాలు ప్యాకెట్‌ కూడా ఇవ్వలేదు. మమ్మల్ని చూసి దూరంగా వెళ్లేవారు. ఉచిత సరుకులు ఏవీ అందలేదు. పలకరించేవారు గానీ, మాట సాయం చేసేవారు గానీ లేకపోవడంతో నేను కుంగిపోయాను. నిత్యం శవాల మధ్య జీవం చేశాం. ఆకలి వేస్తున్నా… అన్నం తినాలని అనిపించేది కాదు. అలాగే పడుకునేదాన్ని. అప్పుడు అమ్మ ధైర్యం చెప్పి, అన్నం పెట్టేది. నాలుగు నెలల క్రితం అమ్మ చనిపోయింది. నా కూతురు వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఒంటరిదాన్ని అయ్యా. కూతురు బిడ్డని, నా కొడుకుని పోషిస్తున్నా. వారి కోసం బతుకుతున్నా.’ అంటున్న మరియమ్మ గుండెల్లో దాగి ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది. ఆరోగ్యం బాగోక పనిలో ఉండకపోతే ఆ రోజు కూలి ఉండదు. ఎప్పుడన్నా మనసు బాగోకపోతే దగ్గర్లో ఉన్న తోబుట్టువు దగ్గరకు వెళుతుంది. ఇటువంటి దుర్భర జీవినం సాగిస్తున్న ఆమె జీవితంలో ఒక పండగ గానీ, వినోదం గానీ లేదు. నిత్యం ఆ శ్మశానవాటికలోనే జీవనం సాగిస్తోంది.
బంధువులు హీనంగా చూస్తున్నారు

లబ్బీపేటకు చెందిన ప్రమీల విజయవాడ, రామలింగేశ్వరపురంలోని పటమటలంక శ్మశానంలో తొమ్మిది ఏళ్లుగా పనిచేస్తోంది. భర్త రాము భవన నిర్మాణ కార్మికుడు. ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పదేళ్ల క్రితం భర్త అనారోగ్యానికి గురై మంచానికే పరిమితయ్యాడు. అప్పటివరకూ ఇంట్లోనే ఉన్న ప్రమీల గుండె ధైర్యం తెచ్చుకుని ఉపాధి కోసం బయటకు వచ్చింది. ఇళ్లల్లో పాచి పనికి వెళ్లింది. భర్తకు వైద్యం చేయిస్తూ, పిల్లల్ని చదివించుకోసాగింది. ఇల్లిల్లు తిరిగే క్రమంలో సమస్యలు రావడంతో ఆ పని మానుకుంది. తెలిసిన వాళ్లు ద్వారా శ్మశానంలో నెలవారీ జీతానికి పనికి కుదిరింది. అక్కడ మొక్కలకు నీళ్లు పెట్టడం, కలుపు తీయడం చేసేది. అప్పుడు రూ.5,500 ఇచ్చేవారు. ఆమె శ్మశానంలో పని చేస్తుందని తెలిసి ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదు. చివరికి ఓ చిన్న రేకుల షెడ్డులో ఉండాల్సి వచ్చింది. మూడేళ్ల నుంచి మృతదేహాలను దహనం చేసే పని కూడా చేస్తోంది. అప్పటి నుంచి రూ.9 వేలు జీతం ఇస్తున్నారు. ఈమె ఇక్కడ పనిచేస్తుందని తెలిసి అత్తంటి వారు మాట్లాడటం మానేశారు. శుభకార్యాలకు పిలవడం మానేశారు. అయినా ప్రమీల మాత్రం ఈ పని మానుకోలేదు. ‘దొంగతనమో మరొకటో చేస్తే భయపడాలి. బాధపడాలి. ఏ తప్పూ చేయని నేను ఎందుకు సిగ్గుపడాలి.’ అంటోంది. ‘రోడ్డు మీద వెళుతుంటే నలుగురూ నాలుగు మాటలు అంటారు. అవేమీ పట్టించుకోను. నా బిడ్డలు మంచిగా చదువుకోవడం నాకు ముఖ్యం.’ అంటుంది ప్రమీల.

jeevana-3
*బయట పని కన్నా… ఇదే మంచిది!
మచిలీపట్నానికి చెందిన సుధారాణి కూడా తొమ్మిదేళ్ల నుంచి శ్మశానంలో పని చేస్తోంది. భర్త ముఠా కార్మికుడు. పని ప్రదేశంలో కిందపడి కాలుకు దెబ్బ తగిలింది. వైద్యం కోసం రూ.5 లక్షలు అప్పు అయ్యింది. భర్త పనిచేయని స్థితిలో ఉండటంతో ఇద్దరు పిల్లల్ని పోషించేందుకు ఆమె ఓ బట్టల దుకాణంలో పనికి వెళ్లింది. ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 అయ్యేది. జీతం సరిపోయేది కాదు. దాంతో దగ్గర్లోని శ్మశానంలోని తోటలో పనిచేస్తుంది. ‘కరోనా సమయంలో మాకు చేతి నిండా పని ఉంది. నా పిల్లలు పస్తులు లేకుండా ఉన్నారు. అలాంటి శ్మశానంలో పని చేయడానికి నేను భయపడను’ అంటుంది సుధారాణి.ఏ మనిషికైనా బతుకు తెరువే ప్రధానమైన వ్యాపకం. ఉన్న దారులన్నీ మూసుకుపోయినప్పుడు- ఏదొక దారి వెతకాల్సి ఉంటుంది. అది శ్మశానంలో పనైనా, మరొకటినైనా. బతుకు భయం ముందు ఇతర భయాలన్నీ బలాదూరే! పనికి ఆడామగా అన్న తేడా లేదని నిరూపిస్తున్న ఈ మహిళలను అభినందిద్దాం. వారు మరింత మెరుగ్గా బతకాలని ఆకాంక్షిద్దాం.