ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ
తొమ్మిది గంటలకు తొలి ఫలితం
15 రౌండ్లలో లెక్కింపు పూర్తి
కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో అభ్యర్థుల భవితవ్యం ‘భద్రం’గా ఉంది. 3న పోలింగ్ ముగిసిన వెంటనే నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి ఈవీఎంలను నల్లగొండలోని ఎఫ్‌సీఐ గోదాములోకి తరలించి భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు నెలల హోరాహోరీ ప్రచారం, పోలింగ్ రోజు సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్.. విజయంపై ఎవరి ధీమా వారిదే. ఎగ్జిట్‌పోల్స్ తమకు అనుకూలంగా ఉన్నాయని, విజయం తమదేనని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఎగ్జిట్‌పోల్స్ అన్నివేళలా నిజం కాలేదని, మధ్యాహ్నం తర్వాత యువత పెద్దసంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారని, వృద్ధులు కారు గుర్తుకు వేయలేకపోయారని, ఇలాంటి కారణాలెన్నో తమ విజయానికి దోహదం చేస్తాయని కమలనాథులు చెబుతున్నారు.
ఎవరికి వారు ధీమాగా ఉన్నా.. అభ్యర్థుల భవితవ్యం మాత్రం ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది. 6నబాక్స్‌లు తెరిచాక ఎవరి భవితవ్యం ఏంటో తెలియనుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలవుతుంది. తొలుత 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలను తెరుస్తారు. 15 రౌండ్లలో కౌంటింగ్‌ను పూర్తి చేయనున్నారు. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. ఏజెంట్లు, సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత, ఈసీ ఇచ్చిన గుర్తింపు కార్డులను చూపితేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలను ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తొలి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్వో రోహిత్‌సింగ్‌తో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు