తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై వైకాపా రౌడీమూకలు జరిపిన రాళ్ల దాడిని, అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్ట్‌ను ఎన్నారైలు ఖండించారు. ఈ మేరకు వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జగన్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గాలకు అద్దం పడుతోంది. చంద్రబాబు నాయుడు ప్రజాదరణను చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకే దొంగ దెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నారు. గతంలో చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చారు. ఎవరైతే ప్రతిపక్ష నేతలపైన దాడి చేస్తున్నారో వారికి పదోన్నతులు కల్పిస్తున్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసినా ఇప్పటివరకు చర్యలు లేవు. ఇక సామాన్యులకు ఏం రక్షణ ఉంటుంది? ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేకుండా పోయింది. భౌతిక దాడుల ద్వారా ప్రతిపక్ష నేతను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం. జగన్ రెడ్డి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి దాడులు మానుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.’’ అని హెచ్చరించారు.
వాషింగ్టన్ డీసీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాను మాగులూరి మాట్లాడుతూ.. ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో వైసీపీ రౌడీమూకలు రాళ్లు రువ్వడం జగన్ రెడ్డి పాలనా తీరుకు నిదర్శనం. నియంత పోకడలతో రౌడీపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యం, రౌడీయిజం, అఘాయిత్యాలు, దురాగతాలు పరాకాష్టకు చేరాయి. ఈ రాక్షస పాలనకు ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని అన్నారు. మన్నన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో శ్రీకాంత్ ఆచంట ముప్పనేని జగన్మోహన్ రావు, గుత్తా రమేష్ బాబు, రామకృష్ణ ఇంటూరి, సీతారామ్, ఆంజనేయప్రసాద్, రమేష్ అవిర్నేని తదితరులు పాల్గొన్నారు.