Business

ఎస్‌బిఐ కళ్లు చెదిరే లాభాలు

ఎస్‌బిఐ కళ్లు చెదిరే లాభాలు

ప్రభుత్వ రంగంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) అదిరిపోయే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్‌ మొండి బాకీలు తగ్గగా.. మరోవైపు ఆదాయం భారీగా పెరిగడంతో రికార్డ్‌ లాభాలను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో ఏకంగా 74 శాతం వృద్థితో రూ.13,264.62 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. ఆ బ్యాంక్‌ చరిత్రలో ఏ మూడు మాసాల కాలంలోనూ ఈ స్థాయి లాభాలను ఆర్జించలేదు. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.7,626.57 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.77,689.09 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన క్యూ2లో 14 శాతం పెరిగి రూ.88,733.86 కోట్లకు చేరింది. క్రితం సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 13 శాతం ఎగిసి రూ.35,183 కోట్లకు చేరింది. అడ్వాన్సులు 19.93 శాతం పెరిగి రూ.25.30 లక్షల కోట్ల నుంచి రూ.30.35 లక్షల కోట్లకు చేరాయి. డిపాజిట్లు 9.99 శాతం వృద్థితో రూ.38.09 లక్షల కోట్ల నుంచి రూ.41.9 లక్షల కోట్లకు పెరిగాయి.

తగ్గిన మొండి బాకీలు..
2022-23 క్యూ2లో ఎస్‌బిఐ స్థూల నిరర్థక ఆస్తులు 3.52 శాతానికి పరిమితమయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 4.9 శాతం జిఎన్‌పిఎ నమోదయ్యింది. నికర నిర్థక ఆస్తులు 1.52 శాతం నుంచి ఏకంగా 0.8 శాతానికి దిగిరావడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం (ఆరు మాసాల్లో)లో బ్యాంక్‌ నికర లాభాలు 37 శాతం పెరిగి రూ.19,333 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే కాలంలో రూ.14,131 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ2లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.66,379 కోట్లకు చేరడంతో మెరుగైన ఫలితాలు ప్రకటించింది.