NRI-NRT

ఎలాన్‌ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు తీవ్ర విమర్శలు‌..!

ఎలాన్‌ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు తీవ్ర విమర్శలు‌..!

టెస్లా అధినేత, ట్విట్టర్‌ సీఈవో ఎలాన్‌మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రపంచానికి అబద్ధాలను పంపిస్తూ, అబద్ధాలను సృష్టించే సంస్థను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు మస్క్‌ కొన్నారంటూ ధ్వజమెత్తారు. ‘మనం ఇప్పుడు దేని గురించి ఆందోళన చెందుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అబద్ధాలను పంపిస్తూ, సృష్టిస్తున్న సంస్థను ఎలాన్‌ మస్క్ కొన్నారు. ఎడిటర్స్ ఇక ఉండరు. ఏది ప్రమాదకరమో అర్థం చేసుకోగలిగే శక్తి పిల్లలకు ఉంటుందని ఎలా ఆశించగలం?’ అని బైడెన్ అన్నారు. చికాగోలో శుక్రవారం నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో పలు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులను తొలగించిన మస్క్‌.. ఇటీవల భారీగా లేఆఫ్‌లు ఉంటాయని ప్రకటించారు. కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేశారు. ఇకపై వారంతా వీధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని మేయిల్స్‌ పంపించారు. ఉద్యోగాల కోత ప్రక్రియ పూర్తయ్యేవరకు ట్విట్టర్‌ ఆఫీసులను మూసే ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.