ప్రేవులు ఆరోగ్యంగా ఉంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యవంతమైన ప్రేవులతో ఒత్తిడి, కుంగుబాటు, మధుమేహం, హృద్రోగ, ఊబకాయం వంటి పలు అనారోగ్య ముప్పులను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దురదృష్టవశాత్తూ 40 శాతం మంది పెద్దలు ప్రేవు సమస్యలు, జీర్ణసంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రేవుల ఆరోగ్యానికి నట్స్ దివ్యౌషధంలా పనిచేస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. శరీరారోగ్యానికి పలు రకాల నట్స్, తృణధాన్యాలు ఉపయోగపడినా ప్రేవుల ఆరోగ్యానికి బాదం పప్పు అత్యుత్తమమని ఈ అధ్యయనం తేల్చింది.
మెరుగైన మెమరీకి బాదం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ఫైబర్ అధికంగా ఉండే నట్స్‌ను పెద్దలు తగినంతా తీసుకోవడం లేదని, చిప్స్, చాక్లెట్స్ వంటి అనారోగ్యకర స్నాక్స్ తీసుకుంటున్నారని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. వీరు నాలుగు వారాల పాటు పలువురు పార్టిసిపెంట్స్‌పై పరిశోధన జరపగా బాదం పప్పు అధికంగా తీసుకున్న వారిలో ప్రేవుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపినట్టు గుర్తించారు.
బాదంలో ఉండే ఆరోగ్యకర కొవ్వులు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఈతో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడైంది. బాదం తినడం ద్వారా శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపేలా బ్యాక్టీరియల్ జీవక్రియలు వేగవంతమవుతాయని పరిశోధకులు తెలిపారు. ప్రేవుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగేందుకు ప్రొ బయాటిక్స్‌ను ప్రేరేపించడంలో ఫైబర్ కీలకంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రతివారం పలురకాల బీన్స్, అవకాడోలు, కూరగాయలు, ప్రిబయాటిక్స్తో పాటు పెరుగు వంటి ఆహారం తీసుకోవడం ద్వారా ప్రేవుల ఆరోగ్యం మెరుగై శారీరక ఆరోగ్యం చేకూరుతుందని పరిశోధకులు వెల్లడించారు.