టెక్నికల్‌గా తెలుగు సినిమా బాగా ఎదిగింది. ‘బాహుబలి’, ‘ఆర్.ఆర్.ఆర్’, ‘పుష్ప’… ఇవన్నీ సాంకేతికంగా తెలుగు సినిమా స్థాయి నిరూపించాయి. రాబోతున్న చిత్రాలలోనూ ఆ స్థాయి విజువల్స్ కనిపించాల్సిందే. ‘ఆదిపురుష్’పై కూడా ఆ ఒత్తిడి ఉంది. రామాయణ నేపథ్యంలో తీసిన పాన్ ఇండియా చిత్రమిది. రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతి సనన్ నటించారు. సంక్రాంతికి విడుదల కావల్సిన సినిమా ఇది. కానీ అనుకొన్న సమయానికి ఈ సినిమా రావడం లేదు. 2023 వేసవికి వాయిదా పడిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. అయినా… ఎందుకింత ఆలస్యం? అని ఆరా తీస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ‘ఆదిపురుష్’ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో దర్శక నిర్మాతలు సంతృప్తిగా లేరని టాక్. విజువల్ ఎఫెక్ట్స్ కోసం మళ్లీ రూ.100 కోట్లు ఖర్చు పెట్టి, వాటిని రీ డిజైన్ చేయాలని భావిస్తున్నారు. అందుకే విడుదల వాయిదా పడిందని సమాచారం. ‘ఆదిపురుష్’ని త్రీడీలోనూ రూపొందించారు. త్రీడీకి సంబంధించి ఎఫెక్ట్స్ కూడా సరిగా రాలేదని, దానిపై రీ వర్క్ జరుగుతోందని, అందుకే ఈ సినిమా ఆలస్యమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా అంతా పూర్తయ్యాక మరో రూ.100 కోట్లు అదనంగా ఖర్చు చేయాలంటే నిర్మాతలకు భారమే. కానీ నాణ్యమైన ప్రొడక్ట్ అందించాలన్న ఉద్దేశ్యంతో నిర్మాతలు రూ.100 కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చారు.