NRI-NRT

అమెరికాలో పాప్‌ సాంగ్స్‌లో తెలుగు భాషకు ప్రాణం పోస్తున్న హైదరాబాదీ

అమెరికాలో పాప్‌ సాంగ్స్‌లో తెలుగు భాషకు ప్రాణం పోస్తున్న హైదరాబాదీ

హైదరాబాద్‌ నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లిన ఎవరైనా.. ‘ఎలా సంపాదించాలి? ఎక్కడ కొత్త కొలువులు ఉన్నాయి? జీతాలు ఎలా పెంచుకోవాలి? ఇంకెంత కష్టపడాలి?’ అనే ఆలోచిస్తారు. కానీ ఖైరతాబాద్‌కు చెందిన వంశీ కలకుంట్ల ఆలోచనలు మాత్రం.. అమెరికన్‌ పాప్‌ స్టైల్‌కు తెలుగు భాషను ఎలా జోడించాలి? తెలంగాణ పల్లె పదాలను పాప్‌లో ఎలా పలికించాలి? ఆ పాటలను పాప్‌ లవర్స్‌తో ఎలా పాడించాలి? అనే కోణంలోనే సాగేవి. కాబట్టే, ఒక్కో మెట్టూ ఎక్కుతూ వందల, వేల, మిలియన్ల వ్యూస్‌కు చేరుకుని డల్లాస్‌ వేదికగా తెలుగు పాప్‌కు ప్రాణం పోస్తున్నాడు వంశీ.
vamsi-kalakuntla2
పదేండ్ల క్రితం ‘ఓపెన్‌ గంగ్నమ్‌ స్టైల్‌’ పాటకు ప్రపంచమంతా నోరు, కాలు కదిపేసింది. గత ఏడాది వచ్చిన ‘పుష్ప’లో ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లీ..’ పాటకు తెలుగుదేశమే కాదు.. యావత్‌ ప్రపంచమూ ఊగిపోయింది. అలా పాటకు భాషతో పన్లేదని మరోసారి రుజువైంది. అలానే, అచ్చమైన తెలంగాణ భాషను, పలుకుబడులను చొప్పించి పాప్‌ అభిమానుల మద్దతు కూడగడుతున్నాడు వంశీ కలకుంట్ల. ప్రస్తుతం డల్లాస్‌లో ఉంటున్న ఈ హైదరాబాదీ.. పాప్‌ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాలు ప్రపంచ సినీ మార్కెట్‌లో దూసుకెళ్తుండటంతో.. తెలుగు పాటలను విదేశీయులు సైతం వల్లెవేస్తున్నారు. ఇదే అదనుగా నేటితరానికి నచ్చేట్టు ఆల్బమ్స్‌ రూపొందిస్తున్నాడు వంశీ.
vamsi-kalakuntla3
ఎవరీ వంశీ కలకుంట్ల?
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన వంశీ కలకుంట్లకు చిన్నప్పటి నుంచీ సంగీతమంటే ఇష్టం. ఆరో తరగతిలో ఉన్నప్పుడే వేసవి సెలవుల్లో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. 2013లో తెలుగు సంగీత దర్శకుడు అజయ్‌ పట్నాయక్‌ దగ్గర పాటల రచన, కూర్పులో మెలకువలు తెలుసుకున్నాడు. బీటెక్‌ తర్వాత మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్లాడు. డల్లాస్‌లో ఓ టెక్‌ కంపెనీలో కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. ప్రోగ్రామ్స్‌ రాస్తున్నప్పుడు కూడా అతని ధ్యాస సంగీతంపైనే. అప్పటికే తెలుగులో కొందరు పాప్‌ పాటలు పాడినా సరైన గుర్తింపు రాలేదు. దీంతో కొన్నాళ్లు పాటలకు దూరంగా ఉన్నాడు. అయినా పాట మీద ప్రేమ మాత్రం పోలేదు. ఓ గిటార్‌ స్టోర్‌లో సంగీత స్వరకర్త, పాటల రచయిత జోనాథన్‌ కామాచో పరిచయంతో అతని ఆలోచనా విధానం మారిపోయింది. అదే నెలలో అతని స్టూడియోలో పాప్‌ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు వంశీ. తర్వాత తనే సొంతంగా పాటలు రాసి, స్వరపరిచి.. పాడటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడే రామ్‌ మిరియాల ‘చౌరస్తా బ్యాండ్‌’ పాపులర్‌ అవుతున్నది. మామా సింగ్‌ వంటి పాప్‌ సింగర్స్‌ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దీంతో ధైర్యం చేసి.. ‘నైట్‌మేర్‌’ పేరుతో ‘ప్రేమలేని లోకంలో.. నువ్వు నాకు దొరికినావే’ అనే వీడియో సాంగ్‌ విడుదల చేశాడు. ఈ వీడియో 3.4 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది.
vamsi-kalakuntla4
పాప్‌ సాంగ్స్‌తో దూసుకెళ్తూ..
‘నైట్‌మేర్‌’తో తెలుగు పాప్‌ సీన్‌లోకి ప్రవేశించిన వంశీ.. వరుస ఆల్బమ్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ ప్రయాణంలో ‘7 డేస్‌’ అనే హాలీవుడ్‌ సినిమాకు పనిచేశాడు. నైట్‌మేర్‌ తర్వాత.. ధనరేఖ, ఐయామ్‌ సింగిల్‌, వినవే దొరసాని, మామి, దేశీ స్పైడర్‌ మ్యాన్‌, మై లవ్‌ వంటి పాటలు విడుదల చేశాడు. ఈ పాటలను తన యూట్యూబ్‌ చానెల్‌లో పెట్టడంతోపాటు.. సోషల్‌ మీడియా ఖాతాల్లో కూడా పోస్టు చేస్తుండటంతో వంశీ ఫాలోయింగ్‌ రోజురోజుకూ పెరిగిపోతున్నది. అతని షార్ట్‌ వీడియోలు, రీల్స్‌, టిక్‌టాక్‌ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి. అమెరికాలో ఉంటూ పాప్‌ సంగీతంపై మరింత దృష్టిపెట్టడం, అక్కడి పాప్‌ సింగర్స్‌, స్వరకర్తలతో కలిసి పనిచేయడం వల్ల అపార అనుభవం గడించాడు. ఇప్పుడు సగటు తెలుగు ప్రేక్షకుడికి ఎలాంటి పాట కావాలో తనకు బాగా తెలుసు. తెలుగు పాప్‌ సంగీతాన్ని అంతర్జాతీయ వేదికలకు విస్తరింపజేయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు వంశీ.
vamsi-kalakuntla-V-jpg-816x480-4g
పాప్‌లో తెలంగాణ ముచ్చట
తన పాటల్లో తెలంగాణ పదాలను, బాణీలను చక్కగా చొప్పిస్తున్నాడు వంశీ. బతుకమ్మ, బోనాలు, దోస్తుల ముచ్చట్లు, గల్లీ యవ్వారాలు.. అన్నీ తన పాటకు వస్తువులే. జియోసావన్‌, స్ఫాటిఫై వంటి మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ నెట్‌వర్క్‌లలో మనోడి పాటలు అందుబాటులో ఉన్నాయి. ‘వంశీ కలకుంట్ల’ పేరుతో సెర్చ్‌ చేస్తే.. దాదాపు పదికి పైగా పాటలు డిస్ప్లే అవుతాయి. వంశీ పాప్‌ సాంగ్స్‌కు ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌ టైమ్స్‌ స్కేర్‌లోని బిల్‌బోర్డ్‌లపై గౌరవ సూచకంగా తన ఫొటోను ప్రదర్శించారు. ‘నేను ఏ భాషలో పాడినా.. అందులో తెలుగు పదాలు కచ్చితంగా ఉండాల్సిందే’ అని తెలుగు భాషపై ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు వంశీ. తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలు సైతం అతని పాటకు ఫిదా అవుతున్నారు.