Devotional

శ్రీవారి సొమ్ము @ 15,938 కోట్లు

శ్రీవారి సొమ్ము @ 15,938 కోట్లు

శ్రీవారి సొమ్ము 15,938 కోట్లు

బంగారం 10,258 కిలోలు

వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌

తిరుమల తిరుపతి ఆస్తులపై

శ్వేతపత్రం విడుదల చేసిన ఈవో

ఏ ప్రభుత్వానికీ సొమ్ము ఇవ్వలేదు

చంద్రగ్రహణం కారణంగా 8న

11 గంటల పాటు ఆలయానికి తాళం

క్రమంగా సర్వదర్శనం టోకెన్ల పెంపు

ఈవో ధర్మారెడ్డి వెల్లడి

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవారికి 15,938 కోట్ల రూపాయల నగదు, 10,258 కిలోల బంగారం ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి భక్తులు సమర్పించిన నగదు, బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసినట్టు తెలిపింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి శనివారం దీనిపై శ్వేతపత్రం విడుదల చేశారు. టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ డబ్బులు ఇవ్వలేదని, భవిష్యత్తులోనూ ఇవ్వబోదని స్పష్టం చేశారు. కాలపరిమితి ముగియబోతున్న రూ.5 వేల కోట్ల డిపాజిట్లను ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుండడాన్ని నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ భక్తుడు శనివారం జరిగిన ‘డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో’ కార్యక్రమంలో ధర్మారెడ్డి దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మారెడ్డి స్పందిస్తూ.. టీటీడీపై బురదజల్లడానికి హిందూమత ద్వేషులు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ ఎప్పుడూ ఇన్వెస్ట్‌ చేసిన సందర్భాలు లేవని చెప్పారు. ఇప్పటి వరకు రూ.15,938 కోట్లను జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్‌ చేసినట్టు తెలిపారు. ఇకపై కూడా అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తిరుమల ఆస్తులపై ఈవో శ్వేతప్రత్రాన్ని విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టకూడదని టీటీడీ బోర్డు ఇప్పటికే తీర్మానించిందని వివరించారు. పసిడి కానుకలను 12 ఏళ్ల దీర్ఘకాలిక డిపాజిట్లలో గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ ద్వారా కరిగించడం, శుద్ధి చేయడం, పెట్టుబడి పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మింట్‌కు పంపిస్తున్నట్టు చెప్పారు.

**అక్టోబరు ఆదాయం 122 కోట్లు
గత అక్టోబరులో శ్రీవారి హుండీ ద్వారా రూ.122.83 కోట్ల ఆదాయం లభించినట్టు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 22.74 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామన్నారు. 1.08 కోట్ల లడ్డూలను విక్రయించగా, 60.91 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించారని చెప్పారు. అలాగే 10.25 లక్షలమంది తలనీలాలు సమర్పించినట్టు వివరించారు. ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు తిరుచానూరు పద్మావతీ దేవి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 1 నుంచి తిరుపతిలో టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్ల జారీని ప్రారంభించామని, శని, ఆది, సోమవారాల్లో 25 వేలు, మిగతా రోజుల్లో రోజుకు 15 వేలు టోకెన్లు జారీ చేస్తున్నామని తెలిపారు. క్రమంగా టోకెన్ల సంఖ్యను పెంచుతామన్నారు. డిసెంబరు 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ఉదయం 8 గంటలకు అమలు చేయనున్నట్టు చెప్పారు. నవంబరు 7న కర్నూలు జిల్లా యాగంటి, 14న విశాఖపట్నం, 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామన్నారు. శ్రీవాణిట్రస్టు దాతలకు డిసెంబరు 1వ తేదీ నుంచి తిరుపతిలోని మాధవంలో ఆఫ్‌లైన్‌లో బ్రేక్‌ దర్శన టికెట్లు జారీ చేయనున్నట్టు చెప్పారు. ఈ నెల 8వ తేదీన చంద్రగ్రహణం కారణంగా దాదాపు 11 గంటల పాటు(ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు) శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయనున్నట్టు తెలిపారు.

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తుల విలువ తొలిసారి వెలుగులోకి వచ్చింది. తిరుమల (Tirumala) శ్రీవారి మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.2.50 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలైన విప్రో, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అయిన నెస్లే కంటే తితిదే (TTD) ఆస్తుల విలువే ఎక్కువ కావడం గమనార్హం. ప్రభుత్వరంగ కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఐఓసీ సైతం శ్రీవారి ఆస్తుల ముందు దిగదుడుపే.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తిరుమల శ్రీవారి ఆస్తులతోపాటు నగదు, బంగారం డిపాజిట్లు, ఆభరణాల మొత్తం విలువను తితిదే శనివారం తెలియజేసింది. 1933 తర్వాత తొలిసారి విలువను వెల్లడిస్తూ శ్వేతపత్రం జారీ చేసింది. ఇందులో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, వివిధ బ్యాంకుల్లో రూ.16వేల కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 960 ఆస్తులు ఉన్నట్లు తితిదే వెల్లడించింది. ఈ మొత్తం విలువ రూ.2.5 లక్షల కోట్ల అంచనా వేస్తున్నారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం.. ప్రస్తుత మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుంటే అనేక భారత బ్లూచిప్‌ కంపెనీల కంటే వెంకటేశ్వర స్వామి ఆస్తే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.2.14 లక్షల కోట్లుగా ఉంది. దేశంలో అతిపెద్ద సిమెంట్‌ కంపెనీ అయిన అల్ట్రాటెక్‌ మార్కెట్‌ విలువ సైతం రూ.1.99 లక్షల కోట్లు, నెస్లే విలువ రూ.1.96 లక్షల కోట్లుగా మాత్రమే. దేశంలోనే అతిపెద్ద చమురు కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఐఓసీ ఆస్తుల విలువ సైతం శ్రీవారి ఆస్తుల విలువ కంటే తక్కువే. ఇవే కాదు ఎన్టీపీసీ, మహీంద్రా అడ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, వేదాంతా, డీఎల్‌ఎఫ్‌ వంటి కంపెనీలు సైతం చాలా దూరంలో నిలిచాయి.