భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒంగోలులోని స్థానిక రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై సాధారణ ప్రయాణికుడిలా తానెక్కాల్సిన రైలు కోసం నిరీక్షించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, వేటపాలెం, ఒంగోలులో శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వెంకయ్య రాత్రి ఒంగోలులో బస చేశారు. ఆదివారం ఉదయం 6.05 గంటలకు పాట్నా నుంచి బెంగళూరు వెళ్లే నంబరు 22351 రైలులో చెన్నైకి ఆయన వెళ్లాల్సి ఉంది. దానికోసం ఆయన తాను ఒంగోలులో బస చేసిన హోటల్ నుంచి ఉదయం 5 గంటలకే బయలుదేరడానికి సిద్ధమయ్యారు. రైలు ఆలస్యంపై సమాచారంతో సుమారు అర్ధగంటపాటు హోటల్‌లోనే ఆగిపోయారు. అనంతరం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వెంకయ్య సుమారు 10 నిమిషాలపాటు 3వ నంబరు ప్లాట్‌ఫాంపై నిరీక్షించారు. రైల్వే సిబ్బంది సమకూర్చిన కుర్చీలో కూర్చుని తనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన వారితో ముచ్చటిస్తూ రైలు వచ్చేంత వరకూ గడిపారు. ఉదయం 6.25 గంటలకు రైలు రావడంతో ఆయన చెన్నై బయలుదేరి వెళ్లారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తోపాటు పలువురు వెంకయ్యకు రైల్వే స్టేషన్‌లో ఆత్మీయ వీడ్కోలు పలికారు.