ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లో చుక్కెదురైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో మాజీ మంత్రి నారాయణముందస్తు బెయిల్ రద్దుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. విచారణకు సహకరించకపోతే దర్యాప్తు సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయించాలని సూచించింది. ప్రతీ చిన్న దానికి సుప్రీంకోర్టుకు రావడం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం చురకలంటించింది.కాగా… అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వంసుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆర్థిక నేరాలతో కూడిన కేసు అని, నిందితులు సీఐడీ విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ‘‘మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములు చేయొద్దు’’ అని ధర్మాసనం పేర్కొంది. నిందితులు విచారణకు సహకరించకపోతే సీఐడీ బెయిల్ రద్దు పిటిషన్ వేసుకోవాలని సుప్రీం కోర్టు సూచిస్తూ… ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.