Health

కరోనాతో దెబ్బతిన్న గుండెకు ‘2డీజీ’ దివ్యౌషధం

కరోనాతో దెబ్బతిన్న గుండెకు ‘2డీజీ’ దివ్యౌషధం

కరోనా వైర్‌సలోని ఎన్‌ఎ్‌సపీ6 అనే ప్రమాదకర ప్రొటీన్‌ కారణంగా దెబ్బతిన్న గుండెను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), రెడ్డీ ల్యాబ్స్‌ కలిసి అభివృద్ధి చేసిన ‘2డీజీ’ మందు అద్భుతంగా నయం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. కరోనా విలయతాండవం చేస్తున్న రోజుల్లో డీఆర్‌డీవో ‘2డీజీ’ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ శక్తి కోసం గ్లైకోలైసిస్‌ అనే ప్రక్రియపై ఆధారపడుతుంది. 2డీజీ ఔషధం ఆ ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా వైరస్‌ మనుగడకు చెక్‌ పెడుతుంది. ఆ మందును.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా ఫ్రూట్‌ఫ్లైస్‌, ఎలుకలపై పరీక్షించారు. కొవిడ్‌-19 బారిన పడినవారిలో దాదాపు ఏడాది దాకా గుండె కండరాలు వాపునకు గురయ్యే ముప్పు, హృదయ స్పందన లయలో తేడాలు రావడం, రక్తం గడ్డలు కట్టడం, పక్షవాతం, గుండెపోటు, హృదయవైఫల్యం వంటి సమస్యలు సంభవించే ప్రమాదం ఉంది. సార్స్‌-కొవ్‌-2 వైర్‌సలోని రెండు ప్రమాదకర ప్రొటీన్లే దీనికి కారణమని మేరీలాండ్‌ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. వీటిలో ఒక ప్రొటీన్‌ వల్ల కలిగే ప్రమాదాన్ని ‘సెలినెక్సర్‌’ అనే ఔషధం తగ్గించగలుగుతోందని.. ఫ్రూట్‌ఫ్లైస్‌, మానవ కణాలపై గత ఏడాది వారు చేసిన అధ్యయనంలో తేలింది. అయితే, ఎన్‌ఎ్‌సపీ6 ప్రొటీన్‌ వల్ల కలిగే డ్యామేజీని మాత్రం ఆ మందు నయం చేయలేకపోయింది. అనంతరం వారు 2డీజీ మందుపై ప్రయోగాలు చేయగా.. వైరస్‌ వల్ల గుండెకు కలిగిన నష్టాన్ని ఆ ఔషధం రివర్స్‌ చేస్తున్నట్టు తేలింది.