ప్రస్తుతం తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో మంచి జోరు మీదున్న హీరోయిన్ రష్మిక. ‘కిర్రిక్ పార్టీ’ కన్నడ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆరేళ్లలోనే జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయమే. ముఖ్యంగా ‘పుష్ప’ చిత్రం ఆమెకు బాలీవుడ్‌లోనూ మంచి పొజిషన్ కల్పించింది. అమితాబ్‌తో కలసి ‘గుడ్‌బై’ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేయ్యడమే కాకుండా మరో రెండు హిందీ చిత్రాలు సైన్ చేసింది. 26 ఏళ్ల ఈ కన్నడ కస్తూరికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే రష్మికకు ఈ మధ్య ఓ దిగులు పట్టుకుంది. అదేమిటంటే.. ఎప్పుడో తను ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాలను ముక్కలు ముక్కలుగా నరికి, కొన్ని వెబ్ సైట్స్ ప్రముఖంగా ఇస్తున్నాయట. నెగెటివ్ కామెంట్స్ తో వచ్చే ఇలాంటి వార్తల వల్ల తనకు ఇబ్బంది ఎదురవుతోందనీ, పరిశ్రమలో కూడా బాడ్ అవుతున్నాననీ రష్మిక వాపోతోంది. ‘సద్విమర్శలకు నేను ఎప్పుడూ స్వాగతం పలుకుతా. ఎందుకంటే అటువంటి వాటి వల్ల నా లోపాలను తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అయితే కావాలని నెగెటివ్‌గా వస్తున్న కొన్ని వార్తలను చదవి తట్టుకోలేక పోతున్నా. అయితే అభిమానుల ప్రేమాభిమానాలు నాకు ధైర్యాన్ని ఇస్తూ ముందడుగు వేయిస్తున్నాయి. అభిమానులను అలరించడానికి, నటనా పరంగా ఎంత కష్టపడడానికైనా నేను సిద్ధమే. నా అభిమానులు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్లు లెక్క’ అంటూ చెప్పుకొచ్చారు రష్మిక. ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలసి ‘పుష్ప 2’ చిత్రంలో, తమిళ హీరో విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సిద్దార్థ్ మల్హోత్రాతో కలసి ‘మిషన్ మజ్ను’, రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు.