దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ అగ్ర కథానాయికగా నిలదొక్కుకొన్నారు పూజాహెగ్డే. పదేళ్ల వ్యవధిలోనే ఆమె కెరీర్‌లో ఎన్నో విజయాలు చూశారు. 2012లో వచ్చిన తమిళ చిత్రం ‘ముగమూడి’తో ఆమె సినీ అరంగేట్రం జరిగింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా అలరించారు. అయితే తన విజయానికి కారణం క్రమశిక్షణ అంటారు పూజాహెగ్డే. భరతనాట్యం వల్లే తనకు జీవితంతో సమతుల్యం ఏర్పడిందని అన్నారు. తనలోని భావోద్వేగాలను మరింత మెరుగ్గా అభినయించడం భరతనాట్యం వల్ల అబ్బిందని తెలిపారు. పలు సందర్భాల్లో కళా ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా చిన్నప్పుడే స్టేజి ఫియర్ పోయిందనీ, సినిమాల్లోకి వచ్చాక ఎలాంటి బెరుకు లేకుండా నటించడానికి ఆ అనుభవం దోహదం చేసిందని పేర్కొన్నారు. ఈ తరం అమ్మాయిలకు ఏదో ఒక కళలో ప్రవేశం ఉండాలన్నారు. అది వారి వ్యక్తిత్వంలో మంచి మార్పులకు కారణమవుతుందని సలహా ఇచ్చారు.