Business

మెటాలో 11 వేల మంది ఉద్యోగులపై వేటు

మెటాలో 11 వేల మంది ఉద్యోగులపై వేటు

*కంపెనీ సీఈవో జుకర్‌బర్గ్‌ ప్రకటన
ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ మాదిరిగా ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. కంపెనీలోని మొత్తం 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని (దాదాపు 13% మందిని) తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఆదాయంలో ఒడిదొడుకులు, పారిశ్రామిక కష్టాలను అధిగమించేందుకు ఈ చర్య చేపడుతున్నట్టు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ బుధవారం తమ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు.కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఇతర సోషల్‌ మీడియా కంపెనీల మాదిరిగానే మెటా రాబడులు కూడా భారీగా పెరిగాయి. ఆ సమయంలో ఎంతో మంది ప్రజలు ఇండ్లకే పరిమితమై ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపం చేయడమే ఇందుకు కారణం. కానీ, లాక్‌డౌన్‌ ముగిసిన నాటి నుంచి జనం ఇండ్ల నుంచి బయటికి వెళ్తుండటంతో మెటా ఆదాయంలో క్షీణత మొదలైంది. దీనికి తోడు ఆర్థిక మందగమనం, ఆన్‌లైన్‌ అడ్వర్టయిజ్‌మెంట్లు తగ్గడంతో మెటా కష్టాలు మరింత పెరిగాయి. ఫలితంగా మెటా చరిత్రలోనే తొలిసారి ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రాబడి క్షీణించడంతోపాటు ఆ తర్వాత కూడా అదే ధోరణి కొనసాగింది. దీంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించక తప్పడం లేదని, మెటా చరిత్రలో ఇది చాలా కఠినమైన రోజని జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. ఇకపై కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతామని, అందులో భాగంగా కొంత కాలంపాటు ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తామని వివరించారు. తొలగించిన ఉద్యోగులకు జుకర్‌బర్గ్‌ క్షమాపణ చెప్పారు. వారికి 16 వారాల ప్రాథమిక వేతనాన్ని చెల్లించనున్నట్టు తెలిపారు.