వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. న్యూఢిల్లీ వేదికగా మెగాటోర్నీ జరుగనుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఐబీఏ), బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్‌ఐ) మధ్య బుధవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. గతంలో పురుషుల ప్రపంచ టోర్నీ ఆతిథ్యాన్ని చేజార్చుకున్న భారత్..మహిళల చాంపియన్‌షిప్ నిర్వహించడం ఇది మూడోసారి. 75 నుంచి 100 దేశాలకు చెందిన బాక్సర్లు పాల్గొనే అవకాశమున్న టోర్నీలో ప్రైజ్‌మనీని రూ.19.50 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో స్వర్ణ పతక విజేతలకు రూ.81 లక్షలు దక్కనున్నాయి. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మాట్లాడుతూ ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తిరిగి నా టైటిల్‌ను నిలబెట్టుకుంటే వచ్చే డబ్బులతో ఇంటితో పాటు మెర్సిడెజ్ కారు కొంటాను. ఐబీఏ అధ్యక్షుడు క్రెమ్లెవ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించి కారులో షికారు చేస్తాం’ అని అంది. ఒకవేళ నిఖత్ ప్రపంచ టైటిల్ గెలిస్తే తానే కారు కొనిస్తానని క్రెమ్లెవ్ హామీ ఇచ్చారు.