ది ఐ’ సినిమా ద్వారా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ ఫిట్‌నెస్ గురించి లోకమంతా కోడైకూస్తున్నది. ఆమె ఏం తింటుంది? మేనికి ఏం రాసుకుంటుంది? జుట్టుకు ఏ నూనె వాడుతుంది?.. అందరిదీ ఇదే చర్చ. దీంతో తన ఆరోగ్య రహస్యం ఏమిటన్నది శ్రుతిహాసన్ చెప్పక తప్పలేదు.
నా చర్మ సంరక్షణకు ఓ నియమావళి ఉంది. దానిని నిత్యం పాటిస్తాను. మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సమయానికి తింటాను. అందులో పోషకాలు ఉండేలా చూసుకుంటాను. చర్మం అందంగా, స్వచ్ఛంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. చర్మం పొడిబారకుండా చూసుకునే పోషకాలను ఎక్కువగా తీసుకుంటాను. ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం సీరమ్‌లను వాడతాను.
కేశాల సంరక్షణ కోసం రెగ్యులర్‌గా జుట్టుకు నూనె పట్టిస్తాను.సహజసిద్ధమైన నూనెలకు ప్రాధాన్యమిస్తాను. తర్వాత మంచి కండిషనర్ ఉపయోగిస్తాను. కుదుళ్లనుంచి పోషణ అందేలా చూసుకుంటాను. అవసరం మేరకే జుట్టును శుభ్రం చేసుకుంటాను. రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు అనారోగ్యం పాలవుతుంది.
షూటింగ్స్‌కు వెళ్లినా, బయటి పార్టీలకు హాజరైనా అవసరమైనంత మేరకే మేకప్ వేసుకుంటాను. అతి మేకప్ వల్ల నష్టాలేమి టన్నది నాకు బాగా తెలుసు. అందుకే పొదుపుగా మేకప్ వేసుకుంటాను. మేకప్‌లో సీరమ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. చర్మం పొడి బారకుండా కాపాడతాయి.
నా ఫిట్‌నెస్ రహస్యం కంటినిండా నిద్రే. రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోతాను. పొద్దంతా కూడా ఖాళీ దొరికితే విశ్రాంతి తీసుకుంటాను. బిజీలైఫ్‌లో నిద్ర, విశ్రాంతి రెండూ అవసరమే.
దీనికితోడు రోజూ ఫిట్‌నెస్ సెషన్ ఉంటుంది. శ్రమతో కూడిన వ్యాయామం కాదిది. ఓ అరగంట వర్కవుట్స్ ఉండేలా పనులు చేస్తాను. ఉన్నచోటనే కూర్చోకుండా కదులుతూ, పనిచేస్తూ.. హాయిగా ఫిట్‌నెస్ సెషన్‌లో పాల్గొంటాను.