పెద్ద కంపెనీల వైన్, షాంపేన్ బాటిళ్లకు మాత్రమే ధర ఎక్కువని చాలామంది అనుకుంటారు. కానీ, ఈ బీరు బాటిల్ ధర వింటే ఎవరైనా నోరెళ్లబెడతారు. దీని ధర ఐదు లక్షల డాలర్ల పైనే. ఒకాయన ఈ బీరు బాటిల్‌ని 5,03,300 డాలర్లకు కొనుగోలు చేశాడు. మన కరెన్సీలో చెప్పాలంటే ఈ బీరు సీసా ధర రూ.4 కోట్ల పైనే ఉంటుంది. దాంతో, దీనికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది బీరు బాటిల్‌గా గుర్తింపు వచ్చింది. ఈ బీరు బాటిల్ పేరు ‘అల్ సాప్స్ ఆర్కిటిక్ అలె’. అల్‌సాప్స్ అనే బీర్ల తయారు కంపెనీ దీన్ని తయారుచేసింది.
ఈ బీరు ప్రత్యేకత ఏంటంటే..
ఈ బీరు బాటిల్ 140 ఏళ్ల నాటిది. దీనిలో ఆల్కహాల్ 10 శాతం ఉంటుంది. ఈ బీరు బాటిల్‌ని ఈబే ఆన్‌లైన్ స్టోర్‌లో వేలానికి పెడితే 157 మంది పోటీపడ్డారు. చివరకు అమెరికాలోని ఒక్లహోమ రాష్ట్రానికి చెందిన ఒకాయన 2007లో ఈ బీరు సీసాను 304 డాలర్లకు కొన్నాడు. మసాచుసెట్స్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యాపారి ఈ బీరు బాటిల్‌కి డెలివరీ ఛార్జి కింద 19.5 డాలర్లు తీసుకున్నాడని చెప్పింది లండన్‌లోని పురాతన వస్తువులు, ఆర్ట్‌వర్క్‌కి సంబంధించిన ఆంటిక్‌ట్రేడ్ అనే కంపెనీ.ఈ బీరు బాటిల్‌పైన పాత కాగితానికి లామినేషన్ కవర్ ఉంది. ఆ కాగితం మీద చేతితో రాసిన అక్షరాలు, పెస్సీ జి.బోల్‌స్టర్ అనే పేరుతో సంతకం ఉంది. అందులో ‘ఈ బాటిల్ 1919లో నా దగ్గర ఉంది’ అని రాసి ఉంది. ఆ నోట్‌ని బట్టి ఈ బీరు బాటిల్‌ని ధ్రువ ప్రాంతాలకు వెళ్లేవాళ్ల కోసం 1852లో ప్రత్యేకంగా తయారుచేశారని తెలిసింది.
**మంచుకు గడ్డకట్టకూడదని
సర్ ఎడ్వర్డ్ బెల్‌చర్ అనే నౌకాదళం అధికారి ఆర్కిటిక్ చల్లటి వాతావరణానికి తగ్గట్టుగా ఒక బీరు బాటిళ్లను తయారుచేయాలని 1852లో అల్‌సాప్స్ కంపెనీని కోరాడట. అందుకని ఆర్కిటిక్ ధ్రువంలో గడ్డకట్టకుండా ఉండేందుకు ఆల్కహాల్ శాతం ఎక్కువ (పది శాతం) ఉండేలా ఈ బీరుని తయారుచేశారు. ఎడ్వర్డ్ ఈ బీరు బాటిళ్లను బ్రిటీష్ నౌకాదళం అధికారి, ఆర్కిటిక్ యాత్రికుడు సర్ జాన్ ఫ్రాంక్లిన్, అతని టీం కోసం ఆర్కిటిక్ ధ్రువానికి పంపించాడని యాంటిక్ ట్రేడ్ వెబ్‌సైట్ చెప్తోంది.