DailyDose

నామినేషన్ వేసిన ములాయం కోడలు డింపుల్

నామినేషన్ వేసిన ములాయం కోడలు డింపుల్

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ సోమవారంనాడు నామినేషన్ వేశారు. 44 ఏళ్ల డింపుల్ యాదవ్ నామినేషన్ వేసినప్పుడు ఆమె భర్త, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఆమె వెంట ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ గత అక్టోబర్ 10వ తేదీన ఇటీవల కన్నుమూయడంతో మైన్‌పురి నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ డిసెంబర్ 5న పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 17వ తేదీ వరకూ కొనసాగనుంది.మైన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గంలో మైన్‌పురి, భోగావ్, కిష్ని, కర్హాల్, జస్వంత్ నగర్‌ అనే 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కర్హాల్, కిష్ని, జస్వంత్ నగర్ స్థానాల్లో గెలుపొందగా, మైన్‌పురి, భోగావ్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది.

**బీజేపీ అభ్యర్థి ఎవరు?
కాగా, మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి ఎవరనేది బీజేపీ ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్, బీఎస్‌పీ, శివపాల్ యాదవ్ ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా (పీఎస్‌పీఎల్)లు పోటీ చేస్తాయా లేదా అనేది కూడా ఇంకా స్పష్టం కాలేదు. డింపుల్ యాదవ్ 2019లో కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుబ్రత్ పాథక్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో ములాయం సింగ్ మైన్‌పురి నుంచి బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ షక్యపై 94,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మైన్‌పురి లోక్‌సభ నియోజకవర్గంలోనే అఖిలేష్ కర్హల్ నియోజకవర్గం ఉడంగా, జస్వంత్ నగర్‌కు శివపాల్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2012 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గం నుంచి డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.