షూటింగ్స్ నుంచి స్వల్ప విరామం తీసుకోబోతున్నది కోలీవుడ్ హీరోయిన్ నయనతార. ఇటీవల కవల పిల్లలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఈ నాయిక…బిడ్డల సంరక్షణ కోసం కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం తను నటిస్తున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత గ్యాప్ తీసుకుని కొత్త చిత్ర సెట్స్‌లో అడుగుపెట్టనుందీ నాయిక. షారుఖ్ ఖాన్ సరసన నయన్ నటిస్తున్న ‘జవాన్’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.ఈ సినిమా చివరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది పూర్తి చేశాక నయనతార మాధవన్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కొత్త దర్శకుడు శశికాంత్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈలోగా సినిమాలు, ఎండార్స్మెంట్స్ ఏవీ ఒప్పుకోవద్దని ఆమె అనుకుంటున్నది. ఈ నెల 18న ఆమె పుట్టినరోజును కూడా ఏ హడావుడి లేకుండా కేవలం భర్త, పిల్లలతోనే గడపాలన్నది ఆమె ఆలోచనగా సన్నిహితులు చెబుతున్నారు.