ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్‌లో పనిచేస్తున్న 50 శాతం మంది ఉద్యోగులను, దాదాపుగా 3500 మంది ఉద్యోగులను గత వారం ఇంటికి పంపించేసిన ఎలన్ మస్క్ తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. శనివారం నాడు ట్విట్టర్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఎలన్ మస్క్ తొలగించినట్లు Platformer.news, CNBC మీడియాలో వార్తలొచ్చాయి. ఎలన్ మస్క్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల దాదాపు 4,400 నుంచి 5,500 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారని తెలిసింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగాల తొలగింపుపై కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఉన్నపళంగా ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఆ ఉద్యోగులకు కూడా ఉద్యోగాలు ఊడినట్లు ఎప్పుడు తెలిసిందంటే.. కంపెనీ ఈమెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ యాక్సెస్ కోల్పోయాక తెలియడం గమనార్హం.
ఎలన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అమెరికాతో పాటు గ్లోబల్‌గా కూడా Content Moderation, Real Estate, Marketing, Engineering విభాగాలతో పాటు ట్విట్టర్‌లోని ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు. ఉద్యోగులకే కాదు మేనేజర్లకు కూడా ఉద్యోగాలు పీకేస్తున్నట్లు ఎలన్ మస్క్ కనీస సమాచారం ఇవ్వలేదట. ఉద్యోగులు తమకు అఫిషియల్ ఈమెయిల్ ఐడీ యాక్సెస్ అవ్వడం లేదని మేనేజర్లకు చెప్పిన సందర్భంలోనే తమ టీంలోని ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయినట్లు మేనేజర్లకు తెలిసిందట.
అంతేకాదు.. “Reprioritization and Savings Exercise”లో భాగంగా ఉద్యోగాల నుంచి మిమ్మల్ని తొలగించామని, నవంబర్ 14 మీ చివరి వర్కింగ్ డే అని సదరు కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ పంపి ఎలన్ మస్క్ చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. ఎలన్ మస్క్ ఎప్పుడైతే ట్విట్టర్‌ను సొంతం చేసుకునేందుకు రంగంలోకి దిగారో అప్పటి నుంచి ట్విట్టర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్న వారి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకూ అందరిలోనూ ఆందోళన మొదలైంది. గత వారం మస్క్ 50 శాతం మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించడంతో ఈ చర్యను నిరసిస్తూ ట్విట్టర్‌లో పనిచేస్తున్న కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్స్ స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేశారు. తాజాగా ఎలన్ మస్క్ మరో దఫా ఉద్యోగాల తొలగింపునకు పాల్పడటంతో టెక్ ఇండస్ట్రీ షాకయింది