సూపర్‌స్టార్ కృష్ణ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. 1980ల్లో ఎన్టీఆర్ రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి సీఎం కావడంతో తెలుగునాట సినిమా గ్లామర్‌కు రాజకీయాలకు బంధం ఏర్పడింది. 1982 డిసెంబరు 17న కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం ‘ఈనాడు’ సినిమా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో విజయంలో కీలకపాత్రను పోషించింది. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టి ఎన్టీఆర్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఎన్టీఆర్‌తో రాజుకున్న విభేదాలు..
1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి.. ముఖ్యమంత్రి అయిన సందర్భంలో.. భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్టీఆర్.. కృష్ణకు విభేదాలు రాజుకున్నాయి. 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైన సమయంలో కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు. అదే సమయంలో ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీని కృష్ణ కలిశారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్‌కు పోటీగా.. ప్రజాకర్షణ ఉన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీకి లాభదాయకంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావించారు. ఈ తర్వాత 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ కృష్ణ పలు సినిమాలు చేశారు.
ఎన్టీఆర్ ప్రభుత్వంపై సెటైర్లు..
కృష్ణ 80వ దశకంలో పలు రాజకీయ నేపథ్యంలోని సినిమాలు చేయడం వెనుక ఉన్నదీ ఇదేనని పలువురు చెబుతుంటారు. సింహాసనం సినిమాలో ప్రతినాయక పాత్రల్లో ఒకటైన కైకాల సత్యనారాయణ పాత్రకు ఎన్టీఆర్ శైలిలో కాషాయం కట్టించి.. సెటైర్లు వేశారు. ‘నా పిలుపే ప్రభంజనం’ సినిమాను విమర్శిస్తూ తెరకెక్కించారు. సినిమాను అడ్డుకోవడానికి రామారావు అభిమానులు థియేటర్ల యజమానులపై దాడి చేయడం, డిస్ట్రిబ్యూటర్లు ఏకం కావడంతో విఫలమైంది. ఆ తర్వాత విజయ నిర్మల దర్శకత్వంలో ‘సాహసమే నా ఊపిరి’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పలు చిత్రాలను తెరకెక్కించారు.
1989లో ఏలూరు ఎంపీగా విజయం..
1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించాడు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా.. తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది. ఆ ఎన్నికల్లో 31 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ప్రత్యర్థి బోళ్ల బుల్లిరామయ్యపై కృష్ణ ఓటమి పాలయ్యారు. 1991లో తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురికావడం, తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో ఏలూరులో ఓటమి చెందడం తదితర కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ మద్దతు ప్రకటించారు.