చెన్నైలో ఉన్న జర్మనీ కాన్సులేట్‌లోని కౌన్సుల్ జనరల్ మైఖేల్ కుచ్లర్ ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించారు. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆ ఇద్దరూ చర్చించుకున్నారు. హైదరాబాద్‌కు తొలి సారి విజిట్ చేసిన కౌన్సుల్ జనరల్ మైఖేల్ కుచ్లర్‌కు మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. తెలంగాణ, జర్మనీ మధ్య ప్రాధాన్యత రంగాల సహకారం గురించి ఇద్దరూ చర్చించుకున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. ఆవిష్కరణలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ అంశాలపై జర్మనీ కౌన్సుల్ జనరల్‌తో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. తెలంగాణలో జర్మనీ కంపెనీలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నట్లు కౌన్సుల్ జనరల్ మైఖేల్ తెలిపారు. చెన్నై కౌన్సులేట్ తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉన్న కార్మికుల్లో తెలంగాణ అయిదో రాష్ట్రంగా నిలుస్తుందని కౌన్సుల్ జనరల్ కీర్తించారు. లైఫ్ సైన్సెస్‌తో పాటు వ్యాక్సిన్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకత సంతరించుకున్నట్లు జర్మనీ కౌన్సులేట్ పేర్కొన్నది. మంత్రి కేటీఆర్‌తో జరిగిన చర్చలు ఫలప్రదం అయినట్లు జర్మనీ కౌన్సుల్ జనరల్ తన ట్వీట్‌లో వెల్లడించారు.