భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీర్యకణాల సంఖ్య కేవలం పునరుత్పత్తికి సంబంధించిన సూచిక మాత్రమే కాదని, దీర్ఘకాలిక వ్యాధి వచ్చే అవకాశాలున్నట్టు అది సూచిస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వృషణాల క్యాన్సర్ రావడం వంటివాటితో పాటుగా జీవితకాలం తగ్గిపోవడానికి అదొక సూచన కావచ్చని అంటున్నారు. ఆధునిక పర్యావరణం, జీవనవిధానాల్లో వచ్చిన మార్పులకు సంబంధించిన ప్రపంచ సంక్షోభానికి వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం అనేది కేవలం ఒక సంకేతం మాత్రమేనని, ఇది మానవజాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న విషయమని తెలిపారు. పలు విశ్వవిద్యాలయాలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించాయి.
2000 ఏడాది తర్వాత వేగవంతం
ఇండియాతో పాటుగా 53 దేశాల డాటాను ఈ అధ్యయనంలో విశ్లేషించారు. 2000 సంవత్సరం తర్వాత వీర్యకణాల సంఖ్య పడిపోవడం వేగవంతమైందని తేలింది. ఇండియాలో తీవ్రస్థాయిలో, నిరంతరంగా వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం నమోదైందని జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హగాయ్ లెవిన్ చెప్పారు. ఇండియాలో డాటా గణనీయంగా అందుబాటులో ఉన్నదని, మిగతా దేశాల్లో డాటా తక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదని అర్థమవుతున్నదని అన్నారు. గత 46 సంవత్సరాల్లో వీర్యకణాల శాతం 50 శాతం తగ్గిపోయిందని, ఇటీవలి కాలంలో అది మరింత వేగవంతమైందని చెప్పారు.
తీవ్ర ఆరోగ్య సమస్యలకు సూచిక
అధ్యయనంలో వీర్యకణాల తరుగుదల కారణాల మీద దృష్టి పెట్టనప్పటికీ తల్లిగర్భంలో ఉండగానే శిశువులో పునరుత్పత్తి అంగాల అభివృద్ధిలో లోపం దీనికి ఒక కారణం కావచ్చని ప్రొఫెసర్ లెవిన్ తెలిపారు. శిశువు అభివృద్ధిలో లోపాలకు జీవనవిధానాల్లో వచ్చిన మార్పులు, పర్యావరణంలోకి చేరుతున్న విష రసాయనాలు కారణమని చెప్పారు. వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడమనేది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచిక కావచ్చని అన్నారు.