కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. పంబ నుంచి దీక్ష స్వీకరించిన స్వాములు దర్శనానికి బయల్దేరారు. ప్రధాన పూజారి, ముఖ్య పూజారి ఆధ్వర్యంలో ఆలయంలో శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గర్భగుడిని తెరిచారు. నేటి నుంచి స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి.డిసెంబర్ 26న శబరిమలలో మండలపూజ ముగియనుంది. డిసెంబర్ 30న మకరవిళక్కు కోసం ఆలయం తెరుచుకోనుంది. జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం తరువాత జనవరి 20న మళ్లీ అధికారులు ఆలయాన్ని మూసివేయనున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సిందేనని దేవస్థాన అధికారులు స్పష్టంచేశారు. శబరిమల ఆలయం వద్ద మండలకాల యాత్ర ప్రారంభమైంది. తంత్రి కంటార్ రాజీవ్ సమక్షంలో మేల్శాంతి ఎన్.పరమేశ్వరన్ నంబూతిరి ప్రారంభించారు. అనంతరం పద్దెనిమిదవ మెట్టు వద్ద నూతన శబరిమల మేల్శాంతి కె. జయరామన్ నంబూతిరి, మళికప్పురం మేల్శాంతి హరిహరన్ నంబూత్రిలకు స్వాగతం పలికారు. అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అచంచలమైన భక్తి ప్రపత్తుల మధ్య నియమ నిష్ఠలతో దీక్షలు చేపట్టిన అయ్యప్ప భక్తులు స్వామియే శరణం అయ్యప్ప.. అంటూ ప్రారంభ దర్శనానికి పోటెత్తారు. అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా కేరళ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా దాదాపు 10వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.