రామారావు (44 యేళ్ళ కెరీరు – 300 సినిమాలు)
నాగేశ్వర్రావు (72 యేళ్ళ కెరీరు; 255 సినిమాలు)
శోభన్ బాబు (37 యేళ్ళలో 230 సినిమాలు)
కృష్ణంరాజు (55 యేళ్ళు; 190 సినిమాలు)
కృష్ణ (50 యేళ్ళు; 350 సినిమాలు)
అయిదుగురూ కలిసి 200 యేళ్ళకు పైగా యాక్టివ్ క్యుములేటివ్ కెరీరు, 1325 సినిమాలు.. అంటే యావరేజిన యేడాదికి ఆరు సినిమాలు.. అంటే రోజూ రెండు షిఫ్టులు పనిచేస్తే కానీ పూర్తికానంత పని..
వీళ్ళు ఎటెంప్ట్ చేయని జాన్రా లేదు.. సాంఘికం, పౌరాణికం, జానపదం, డ్రామా, కామెడీ, రొమాన్సు, ఫ్యామిలీ, యాక్షన్, హారరు.. అన్నీ చేశారు.. తమ కెరీరు పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ప్రయోగాలు చేయడానికి వెనుకాడలేదు..
ఒకపక్కన అభిమానులు పోస్టర్ల మీద భీకరమైన పేడ యుధ్ధాలు చేస్కుంటూ ఉన్న సమయంలో మల్టీస్టారర్స్ చేశారు.. ఏ సీజీలూ లేని ఆర్గానిక్ ఫైట్లూ, డాన్సులూ చేశారు..
లేబొరేటరీ దగ్గర రిలీజుకి ముందు రోజులతరబడి జరిగే ప్రింటింగు ప్రాసెస్సులు, వందలకొద్దీ ప్రింట్లు, వేలకొద్దీ రీలు బాక్సులు, బస్తాలతో కలెక్షన్ల క్యాషు తీసుకొచ్చి బ్యాంకుల్లో గుట్టగా పోసే డిస్ట్రిబ్యూటర్లు, రీలు బాక్సులు పట్టుకుని పరుగులు తీసే థియేటరు కుర్రాళ్ళు, టికెట్ కౌంటర్లదగ్గర చొక్కాలు చిరిగిపోయి మోచేతులు డోక్కుపోయేంతగా ముష్టియుధ్ధాలు, హీరో ఎంట్రీలకు చిరిగిపోయే స్క్రీన్లు, ఈలల సౌండుకి పగిలిపోయే స్పీకర్లు, యాభై అడుగుల ఎత్తులో భారీ కటౌట్లు, పదిరూపాయల టికెటు వందకి అమ్ముడుపోయేంత బ్లాక్ ఫివర్, శతదినోత్సవాలు, సిల్వర్ జూబిలీలు, యేడాదికి పైగా ఆడించిన ప్లాటినం జూబిలీలు, లక్షలకు పైగా అమ్ముడుపోయే ఆడియో క్యాసెట్లు, డైలాగు డ్రామాలు..
అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు భాషకున్న ప్రత్యేకమైన స్థానాన్ని పదిలంగా కాపాడారు.. జాతికి విపత్తు వొచ్చినప్పుడు అందరూ ఒక్కటై అందరినీ ఒక్కతాటిమీదికి తీసుకొచ్చి జోలెపట్టి విరాళాలు సేకరించారు.. ఉద్యమాలు చేశారు, రాజకీయాల్లో పాల్గొన్నారు, పదవులు చేపట్టారు, పద్మశ్రీలు సంపాదించుకున్నారు..
ఈ తరం వెళ్ళిపోయింది.. ఈ యేడాది కృష్ణంరాజు, కృష్ణ ఇద్దరూ వెళ్ళిపోవడంతో ఒక శకం ముగిసిపోయింది..
ఈరోజు తెలుగు సినీ అభిమాని ప్రతి ఒక్కరూ వీళ్ళందరికీ నివాళిగా ఒక్క కన్నీటిబొట్టు రాల్చాల్సిన సమయం.. అందరినీ గుర్తుతెచ్చుకుని గుండెల్లోని అభిమానాన్ని పెదాలమీదికి తెచ్చుకుని హాయిగా ఓ చిరునవ్వు నవ్వాల్సిన సమయం..