హైదరాబాద్‌లో సూపర్‌స్టార్ కృష్ణ పేరు మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది. మెమోరియల్ హాల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతోపాటు ఆయన నటించిన 350 చిత్రాలకు సంబంధించిన వివరాలు, ఫొటోలు, షీల్డ్‌లు ఉంచనున్నారని తెలుస్తోంది. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. బుధవారం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. అయితే మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. గొప్ప వ్యక్తి అంత్యక్రియలు సొంత ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా చేస్తే బావుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందించారు. అలా చేయడానికి ఓ కారణం ఉందని ఆదిశేషగిరిరావు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కృష్ణగారి భార్య అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు కూడా చేయాలని అలా చేశామన్నారు. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండేలా కుటుంబ సభ్యులంతా ఓ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. సూపర్‌స్టార్ కృష్ణ పేర అతిపెద్ద మెమోరియల్ హాల్ కట్టాలని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. అందులో కృష్ణ నటించిన 350 చిత్రాల వివరాలు. రీల్స్, ఆయన సాధించిన ఘనత ఇలా అన్ని వివరాలను అభిమానులు సందర్శనార్థం అక్కడ పొందుపరుస్తారని హైదరాబాద్‌లో ఈ మెమోరియల్ ఎక్కడ కట్టాలనేది త్వరలో నిర్ణయిస్తారని సమాచారం.