DailyDose

గూఢచారిణి 116

Auto Draft

భారత సంతతికి చెందిన నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ప్రభుత్వం తరఫున గూఢచారిణిగా పనిచేశారు. తొలి మహిళా వైర్‌లెస్‌ రేడియో ఆపరేటర్‌గానూ చరిత్రలో నిలిచిపోయారు. హిట్లర్‌ నాయకత్వంలో నాజీలు ఆక్రమించిన ఫ్రాన్స్‌ భూభాగంలో ఆమె శత్రువులకు పట్టుబడ్డారు. సూఫీ సంప్రదాయంలో పుట్టిపెరిగిన ఆ వీరవనిత జీవితం యుద్ధభూమిలోనే ముగిసిపోయింది. నూర్‌ జీవనగాథ ఆధారంగా రూపొందించిన నాటకాన్ని ప్రస్తుతం లండన్‌లో ప్రదర్శిస్తున్నారు.

నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌.. 1914 జనవరి 1న రష్యా రాజధాని మాస్కోలో జన్మించారు. తండ్రి ఇనాయత్‌ ఖాన్‌ భారత సంతతి వ్యక్తి. తల్లి అమీనా బేగం అమెరికన్‌. ఇనాయత్‌ది మైసూరు పులి టిప్పు సుల్తాన్‌ వంశం. ఆయన సంగీత విద్వాంసుడు, సూఫీ బోధకుడు. నూర్‌ కుటుంబం మాస్కో నుంచి మొదట లండన్‌కు వలస వెళ్లింది. అక్కడినుంచి ప్యారిస్‌కు మారింది. నూర్‌ విద్యాభ్యాసమంతా అక్కడే. సాహిత్యంలో నైపుణ్యం సాధించి.. ఇరవై జాతక కథలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. సూఫీ భావజాలం వల్ల కావచ్చు.. అహింస, సర్వమత సమభావన చిన్నతనంలోనే అలవడ్డాయి. ఈ రకమైన ఆలోచనలే ఆమెను ఫాసిస్టు ధోరణికి వ్యతిరేకంగా పోరాడేలా ప్రేరేపించాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ సైన్యంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. యుద్ధం ముగిసిన తర్వాత భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనాలనుకుంది. అయితే, నాజీ సేనలను ఫ్రాన్స్‌ చుట్టుముట్టడంతో నూర్‌ ఎలాగోలా తప్పించుకుని ఇంగ్లండ్‌ వెళ్లి పోయింది. అక్కడే, బ్రిటిష్‌ సైన్యానికి అనుబంధంగా ఉన్న.. వుమెన్‌ ఆగ్జిలర్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో చేరింది. వైర్‌లెస్‌ రేడియో ఆపరేటర్‌గా, స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా వివిధ హోదాల్లో పని చేసింది. అక్కడ కూడా ఏవో అవరోధాలు ఎదురు కావడంతో.. ఫ్రాన్స్‌కు వెళ్లిపోయింది. ‘మెడలీన్‌’ అనే మారుపేరుతో రేడియో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించింది. ఇంతలోనే, ఆమె బృందంలోని చాలామంది సభ్యులను నాజీ సేనలు అరెస్ట్‌ చేశాయి. నూర్‌ మాత్రం చాకచక్యంగా తప్పించుకుంది. కానీ, నమ్మినవాళ్లే ఆమెకు వెన్నుపోటు పొడిచారు. నాజీలకు పట్టించారు. ఆ చేతులకు సంకెళ్లు పడ్డాయి. చిత్రహింసలు పెట్టారు. అయినా, నాజీలకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి సంబంధించి ఏ చిన్న రహస్యాన్ని కూడా వెల్లడించలేదు. దీంతో 1944 సెప్టెంబర్‌లో నూర్‌ను డచావు కాన్సెంట్రేషన్‌ క్యాంపునకు తరలించారు. సెప్టెంబర్‌ 13న నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.

నూర్‌ మరణించి ఇప్పటికి, 78 ఏండ్లు గడిచిపోయాయి. అయినా బ్రిటన్‌లో ఆమె త్యాగాన్ని ఇంకా స్మరించుకుంటున్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం జార్జి క్రాస్‌ పురస్కారం ప్రకటించింది. లండన్‌లో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆమె జీవితం ఆధారంగా శ్రాబణీ బసు అనే రచయిత్రి ‘స్పై ప్రిన్సెస్‌’ పేరుతో జీవిత చరిత్ర కూడా రాశారు. నూర్‌ గురించి తెలుసుకునేందుకు ఇదే ప్రధాన ఆధారం. తాజాగా లండన్‌లో ఆమె జీవిత గాథను నాటకంగా ప్రదర్శిస్తున్నారు.