అది తెలుగునాట అంతర్వేది, అహోబిలం, సింహాచలం కాదు, ధర్మపురి కూడ కాదు, యాదగిరిగుట్ట అంతకన్నా కాదు అయినా సమీపంలో ఒక గుట్ట కనిపిస్తుండగా గుడిలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి కొలువుదీరాడు. వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆ పరిసరాలు మార్మోగుతుండగా అచ్చం యాదగిరిగుట్ట తలపించిన ఆ సన్నివేశం అరబ్బు దేశమైన ఒమాన్ రాజధాని మస్కట్ లోని దారసత్ లోని శ్రీ కృష్ణా ఆలయంలో శుక్రవారం కన్నుల పండువగా జరిగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం.గల్ఫ్ దేశాలలో ప్రప్రధమంగా ఒమాన్ లో ఒమాన్ తెలంగాణ సమితి నిర్వహించిన ఈ వేడుక నిర్వహణకై పంచనారసింహులు స్వయంభువులుగా కొలువైన క్షేత్రం యాదగిరిగుట్ట నుండి ప్రత్యెకంగా అర్చకుల బృందం వచ్చింది.
అరబ్బు నేల దేవదేవుడి కల్యాణ క్రతువు వేళ సంప్రదాయ హంగులతో మెరిసిపోగా, కల్యాణం వీక్షించేందుకు ప్రవాసీ భక్తజనం పోటెత్తింది. తెల్లవారు అయిదుగంటల నుండి ప్రారంభమైన శ్రీ లక్ష్మినరసింహాస్వామి సుప్రభాతం కంటె ముందుగానె ఓం నమో నారసింహాయ అనే నామస్మరణతో వందలాది కిలో మీటర్ల సదూర ఎడారి విలాయత్ల (రాష్ట్రాలు) నుండి భక్తులు చేరుకోన్న తీరు భక్తి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించింది. యాదిగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్గంథీగల్ లక్ష్మినరసింహాచార్యులు నేతృత్వంలో మంగళగిరి నర్సింహామూర్తి ఇతర అర్చకుల బృందం అధ్వర్యంలో జరిగిన తిరుకళ్యాణ మహోత్సవ కమనీయ దృశ్యం ప్రవాసీయుల హృదయం పరవశించింది. యాదాద్రి క్షేత్ర మహాత్మ్యం వివరణను భక్తులు శ్రధ్ధగా అలకించారు. మాతృభూమికు దూరంగా ఎడారిలో యాదాద్రిను పులకించిన అనుభూతి కల్గిందని మస్కట్ లో నివసించె కామారెడ్డి జిల్లాకు చెందిన బల్ల అంజనేయుల అనిల్ వ్యాఖ్యానించారు.
ఉత్సవమూర్తులను కూడ ప్రత్యెకంగా అర్చకుల బృందం ఆలయ పర్యవేక్షకులు సురేందర్ రెడ్డి అధ్వర్యంలో గల్ఫ్ కు తీసుకోవచ్చింది. భక్తులకు భోజన వసతిను దాతలు సమకూర్చగా పసందైన వంటకాలను అయ్యప్ప స్వామి భక్తుల బృందం వండించింది. మస్కట్ లోని శ్రీ కృష్ణా ఆలయాన్ని ఒమాన్ ప్రభుత్వ ధార్మిక వ్యవహారాలు మరియు వక్ఫ్ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఏర్పడ్డ ఒక ట్రస్ట్ ద్వార నిర్వహించడం జరుగుతుంది.