ప్రముఖ బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూతపడ్డాయి. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శీతాకాలం నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. రాబోయే ఆరు నెలల పాటు పాండుకేశ్వర్, జోషిమఠ్‌లో బద్రీనాథుడికి పూజలు జరుగనున్నాయి. ఆలయం మూసివేయనున్న సందర్భంగా సింహద్వారాన్ని బంతిపూలతో అలంకరించారు. గత ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు జరుగుతుండగా.. శుక్రవారం లక్ష్మీదేవి ఆవాహన పూజలు చేసి, ‘కడాయి భోగ్’ నైవేద్యం సమర్పించారు. శనివారం రావల్ ఈశ్వరీ ప్రసాద్ నంబూదరి బద్రీనాథ్ ధామ్ గర్భాలయంలో లక్ష్మీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఉద్ధవ్, కుబేర్ జీ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బద్రీనాథ్ – కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఇన్‌చార్జి డాక్టర్ హరీశ్ గౌర్ మాట్లాడుతూ ఘృత్ కంబల్ (నెయ్యిలో ముంచిన ఉన్ని దుప్పటి) బద్రీనాథుడికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ తర్వాత 3.35 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు తెలిపారు. ఏటా శీతాకాలం సందర్భంగా ఛార్‌ధామ్ ఆలయాలను మూసివేసే విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో మంచు విపరీతంగా కురుస్తుంటుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచువర్షం కురుస్తున్నది.