NRI-NRT

దుబాయ్‌లో ఇప్పటివరకు జారీ అయిన గోల్డెన్ వీసాలు ఎన్నో తెలుసా..?

దుబాయ్‌లో ఇప్పటివరకు జారీ అయిన గోల్డెన్ వీసాలు ఎన్నో తెలుసా..?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం గోల్డెన్ వీసాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఐదు, పదేళ్ల కాలపరిమితితో ఈ వీసాలను జారీ చేస్తోంది. దీనికోసం 2019లో ఓ ప్రత్యేక వ్యవస్థను యూఏఈ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) కేవలం దుబాయ్ పరిధిలోనే 2019 నుంచి ఇప్పటివరకు జారీ అయిన గోల్డెన్ వీసాల వివరాలను వెల్లడించింది. ఈ మూడేళ్లలో సుమారు 1,51,666 గోల్డెన్ వీసాలు మంజూరు అయ్యాయని జీడీఆర్ఎఫ్ఏ వెల్లడించింది. అలాగే 2022 ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు 1,55,42,384 ఎంట్రీ, రెసిడెన్సీ పర్మిట్లను జారీ చేసినట్లు తెలిపింది. 2020-21తో పోలిస్తే ఈ ఏడాది 43శాతం మేర విదేశీ ఉద్యోగుల సంఖ్య పెరిగిందని జీడీఆర్ఎఫ్ఏ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

ఇక వీసా ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ మధ్య కాలంలో అనేక వినూత్న కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని తెలిపింది. జీడీఆర్‌ఎఫ్‌ఏ ద్వారా 96 శాతం మంది వినియోగదారులకు సేవలు అందుబాటులో ఉన్నాయని దుబాయ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అహ్మద్ అల్ మర్రి అన్నారు. ఈ సందర్భంగా రెసిడెంట్ వీసా విభాగానికి సంబంధించి వార్షిక నివేదికను ఆయన పరిశీలించారు. ఈ డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల అద్భుతమైన పనితీరు కారణంగానే మంచి ఫలితాలను సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఇక భారత్ నుంచి కూడా యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాలు పొందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్, మలయాళ స్టార్స్‌తో పాటు ఇతరులకు కూడా వీసాలు దక్కాయి.