DailyDose

నా కూతురి భద్రత గురించి భయంగా ఉంది : రిషి సునాక్

నా కూతురి భద్రత గురించి భయంగా ఉంది : రిషి సునాక్

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ తన కుమార్తె కృష్ణభద్రత గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పురుషులు తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాల విలువను గుర్తించడం లేదని, చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని అన్నారు. తన కుమార్తె ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లినపుడు ఆమె భద్రత విషయంలో తనకు భయంగా ఉంటోందని చెప్పారు.రిషి సునాక్ విలేకర్లతో మాట్లాడుతూ, తన పెద్ద కుమార్తె కృష్ణ గురించి అరమరికలు లేకుండా ప్రస్తావించారు. ఆమె మరింత ఎక్కువ స్వాతంత్ర్యాన్ని కోరుకుంటుందన్నారు. ఎక్కడికైనా తనంతట తాను వెళ్లగలిగే వయసులో ఉందన్నారు. గతంలో తాను ఛాన్సలర్‌గా పని చేసిన కాలంలో డౌనింగ్ స్ట్రీట్‌లోని ఫ్లాట్‌లో తాము నివసించకపోవడానికి ఇదే కారణమని చెప్పారు. లివర్‌పూల్‌లో తొమ్మిదేళ్ళ బాలిక ఒలీవియా ప్రట్-కోర్బెల్‌ను కాల్చి చంపిన సంఘటనతో సహా బ్రిటన్‌లో జరుగుతున్న అనేక నేరాలు తనను కలవరపరుస్తున్నాయన్నారు. ఓ బిడ్డకు తండ్రిగా ఈ విషయాలను తాను చెప్తున్నానని తెలిపారు.
తన పిల్లలు, మిగతా అందరూ సురక్షితంగా వెళ్లి, తిరిగి రాగలిగే పరిస్థితులను సృష్టించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లల కోసం అటువంటి పరిస్థితులు, భద్రత ఉండాలని కోరుకుంటారని చెప్పారు. గతంలో భద్రత గురించి తాను అంతగా పట్టించుకునేవాడిని కానన్నారు. పురుషులు చాలా మంది ఇదే విధంగా వ్యవహరిస్తారన్నారు. చాలా మంది మహిళలు, బాలికలు తమకు తగినంత రక్షణ ఉందని భావించగలిగే పరిస్థితులు లేవని గత ఏడాది జరిగిన సంఘటనలు వెల్లడిస్తున్నాయన్నారు. దీనిని పరిష్కరించడం, ప్రజలకు భద్రత కల్పించడం వ్యక్తిగతంగా తనకు చాలా ముఖ్యమైన విషయమని చెప్పారు.ప్రధాన మంత్రిగా తన పదవీ కాలంలో నేరాలను తగ్గించాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పారు. పరిస్థితులను చక్కదిద్దడంలో ఇది భాగమని తాను భావిస్తున్నానన్నారు. అత్యంత సాధారణ నేపథ్యంగల ప్రజలు నేరాలకు ఎక్కువగా బాధితులువుతున్నారని, అటువంటివారికి భద్రత కల్పించేందుకు వీథుల్లో ఎక్కువ మంది పోలీసులను నియమిస్తానని చెప్పారు. ఇళ్లలో దొంగతనాలు, వాహనాలు, వ్యక్తుల వద్ద ఉన్న వస్తువులు, సొమ్ము వంటివాటిని దొంగిలించడానికి సంబంధించిన నేరాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు