DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

* వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘టీడీపీ కోసం కార్యకర్తలు తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నాతో సహా నేతలే సిద్ధంగా లేరు. నేతలు కూడా రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉండాలి. 160 స్థానాలకంటే ఎక్కువగానే టీడీపీ సీట్లు సాధిస్తుంది. శ్రీకాకుళంతో టీడీపీ హవా ప్రారంభమైంది… మహానాడుతో ఉధృతమైంది.. రాయలసీమలో ప్రభంజనమైంది. కర్నూలు జిల్లాలో చంద్రబాబు టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హిట్ అయ్యాయి. టీడీపీ గెలుపు ఖాయం.. కానీ గెలుపనే ధీమా వద్దు. చంద్రబాబు చివరి ఎన్నికలంటే కొందరు పిచ్చి కుక్కల్లా మాట్లాడారు. అవును చివరి ఎన్నికలే. దుర్మార్గ పాలన నుంచి విముక్తి కలిగించడానికి ఇవే చివరి ఎన్నికలు. చంద్రబాబు కష్టపడేది పదవుల కోసం కాదు.. రాష్ట్రాభివృద్ధి కోసం. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. మన మధ్య తగాదా పెడుతున్నారు. సీఎం జగన్‌(CM Jagan)ది పాచి నోరు. ఏపీ రాజధాని అమరావతేనని జగన్ అనలేదని నిరూపిస్తే ఉరేసుకుని చస్తాను. అమరావతిని రాజధానిగా అసెంబ్లీ సాక్షిగా జగన్ ఒప్పుకోలేదా..? మేం దాన్ని నిరూపిస్తాం.. జగన్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

* టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక పిచ్చోడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లాలో ‘లా అండ్ ఆర్డర్’ బాగుందని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరమేశ్వర రెడ్డిని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి అభినందించారు. అనంతరం నారాయణ స్వామి మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల వ్యాఖ్యల తీరు చూస్తుంటే రౌడీలు, గుండాల్లాను తలపిస్తోందన్నారు. రాజకీయాల్లో ప్రజలు పూలు చల్లినా స్వీకరించాలి, రాళ్లు విసిరినా స్వీకరించాలి.. అంతే తప్ప రండి కొట్టుకుందాం అనడం కరెక్ట్ కాదన్నారు. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రోడ్లపై చొక్కా చించుకుని కాగితాలు ఏరుకునే పరిస్థితిలోకి వెళ్తారని వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్రపై స్పందిస్తూ.. మీసాలు తిప్పి, తొడలు కొట్టి ప్రజలు రెచ్చగొట్టడం కాదని వ్యాఖ్యానించారు. పాదయాత్ర అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసింది చరిత్రలో నిలిచిపోయేదని తెలిపారు. విద్యా వ్యవస్థలో జగన్ మోహన్ రెడ్డి పెను మార్పులు తీసుకువచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.

* రాష్ట్రంలోని రెండు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఒక్కో దాంట్లో 150 సీట్ల చొప్పున మొత్తం 300 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుమతులను జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) పునరుద్ధరించింది. గతేడాది మౌలిక సదుపాయాల లేమి, మానవ వనరుల కొరత కారణాలతో సీట్లను రద్దు చేసిన మహావీర్‌, టీఆర్‌ఆర్‌ వైద్య కళాశాలలకు ఈ ఏడాది సీట్లను కొనసాగించుకోవడానికి ఎన్‌ఎంసీ అనుమతించింది. 2022-23 సంవత్సరానికి మాత్రమే ఈ అనుమతులు చెల్లుబాటవుతాయని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. నిబంధనల మేరకు ప్రవేశ ప్రక్రియ నిర్వహించాలని సూచించింది. ఏమైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు చేపడతామని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 6,500కు పెరిగింది. కొత్తగా పెరిగిన సీట్లను రెండో విడత ప్రవేశ ప్రక్రియలో భర్తీ చేస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది

*తెలంగాణలో ఎలాంటి అరాచక, అనాగరిక పరిస్థితులు నెలకొన్నయో నేడు జరిగిన పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. విమర్శలకు జవాబు చెప్పడం చేతగాక ప్రజాప్రతినిధి అయిన ఎంపీ అర్వింద్ గారి ఇంటిపై గూండాలతో దాడి చేయించడం, వారి తల్లిగారిని బెదిరించడం, ఆ ఇంటివారిని భయభ్రాంతుల్ని చెయ్యడం చూస్తుంటే రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని వేరే చెప్పాల్సిన పని లేదన్నారు. మహిళా రక్షణ అని పదే పదే చెప్పుకునే టీఆరెస్ సర్కారు ఇక ఆ మాట ఎత్తే అర్హతను పూర్తిగా కోల్పోయిందన్నారు. గర్వం పెరిగిపోయి రోజులు దగ్గర పడినప్పుడే ఇలాంటి పెడబుద్దులు పుట్టుకొస్తాయని విజయశాంతి పేర్కొన్నారు.

*కుప్పం నియోజకవర్గం గుడిపల్లి దగ్గర అగస్త్య సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. అయితే ఈ ప్రదర్శనకు గంగవరం మండలం పొన్నుమాకునపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎగ్జిబిషన్ సెంటర్‌కు లారీల్లో తరలించారు. జరగరాని ప్రమాదం ఏమైనా జరిగితే 400 మంది విద్యార్థుల పరిస్థితి ఏమవుతుందంటూ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు నిలదిస్తున్నారు. ఈ విషయంపై కవరేజ్‌ కోసం వెళ్లిన మీడియాపై ఉపాధ్యాయులు(Teachers) తిరగబడి చిందులు తొక్కారు.

*సైన్స్ ఎగ్జిబిషన్‌కు సంతలో పశువుల్లా విద్యార్థులను (Lorries)లారీల్లో (Science Exhibition)తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ‘నాడు-నేడు’ పేరుతో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. విద్యార్థులను లారీల్లో తరలించడమేంటి? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు.

* బంజారాహిల్స్‌లోని ఎంపీ అరవింద్‌ నివాసానికి వెళ్లి కర్రలతో తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా లోపలికి ప్రవేశించారు. ఫర్నీచర్‌ను, కిటికీలను ధ్వంసం చేశారు. అరవింద్‌ కుటుంబ సభ్యులను బెదిరించారు. ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ మారాలంటూ తన బిడ్డ కవితను బీజేపీ వాళ్లు అడిగారని ఇటీవల జరిగిన టీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా విలేకరులతో మాట్లాడిన నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌.. కవితను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని, కానీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో ఆమె టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు.

*ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. క్విడ్‌ ప్రో కో జరిగినట్లు నిర్ధారణకొచ్చింది. సీబీఐ పకడ్బందీగా చార్జిషీట్లు దాఖలు చేసిందని అభిప్రాయపడింది. అసలు కార్యకలాపాలే ప్రారంభంకాని జగన్‌కు చెందిన సంస్థల్లో హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌, అరబిందో సంస్థ పెట్టుబడులు పెట్టినట్లు కోర్టు గుర్తించింది. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌పై ఉన్న ఆరోపణలను కొట్టివేయడానికి నిరాకరిస్తూ.. ట్రయల్‌ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ గతేడాది తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిని హెటిరో కంపెనీ సుప్రీంకోర్టులోసవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హెటిరో తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో హెటిరో గ్రూపు ఏ-4గా ఉందని తెలిపారు. కంపెనీ గ్రూపును నిందితురాలిగా చేర్చరాదని, వ్యక్తులనే నిందితులుగా చేర్చాలని.. ఈ కేసులో ఏమీ లేదని అన్నారు. అభియోగాలను కొట్టేయడానికి (క్వాష్‌) నిరాకరించిన మేజిస్ట్రేట్‌ కోర్టు.. కారణాలను రికార్డు చేయనవసరం లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొందని ప్రస్తావించారు.

*పరిపాలన కారణాలతోనే ముగ్గురు హైకోర్టు జడ్జీల బదిలీకి సిఫార్సు చేసినట్టు శుక్రవారం సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాజాను రాజస్థాన్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డి, గుజరాత్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ నిఖిల్‌ ఎస్‌ కరియేల్‌లను పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆఽధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల కొలీజియం ఈ సిఫార్సులు చేసింది. జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి, జస్టిస్‌ కరియేల్‌ల బదిలీకి నిరసనగా ఆయా హైకోర్టుల న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు.

* పెండింగ్‌ కేసుల భారం తగ్గించడానికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకొంది. ప్రతి రోజూ ప్రతి ధర్మాసనం వైవాహిక వివాదాల కేసులు పది, మరో పది బెయిల్‌ అభ్యర్థన కేసులపై విచారణ జరపనున్నాయి. మొత్తం అందరు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌ కోర్టులో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ శుక్రవారం వెల్లడించారు. సుప్రీంకోర్టులో మొత్తం 13 ధర్మాసనాలు ఉండగా, ఈ నిర్ణయం మేరకు రోజూ 130 వైవాహిక వివాదాల కేసులు, అంతే సంఖ్యలో బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఈ రెండు అంశాలకు సంబంధించి మొత్తం 3,000 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. శీతాకాల సెలవులు ఇచ్చేలోగా వీటన్నింటిపై విచారణ పూర్తి చేయాలని నిర్ణయించింది.

*ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు జరిమానా విధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు నేరుగా ఎగదోస్తుంటే, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరికొన్ని అడ్డుకుం టున్నాయంటూ పాకిస్థాన్‌, చైనాను ఉద్దేశించి మోదీ విరుచుకుపడ్డారు. ఇదే వాటి విదేశాంగ విధానమని దుయ్యబట్టారు. ఉగ్రవాద భావజాలానికి అనుకూలతను, సానుభూతిని సృష్టించే సంస్థలను, వ్యక్తులను ఉపేక్షించరాదని ప్రధాని పిలుపు నిచ్చారు. న్యూఢిల్లీలో శుక్రవారం ‘ఉగ్రవాదానికి నిధుల నిరోధం’ అనే అంశంపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన ప్రపంచ దేశాల హోంమంత్రుల సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను పెకిలించివేయాల్సిందేనని ఈ సమావేశంలో మోదీ స్పష్టం చేశారు.

*కూకట్‌పల్లిలోని రంగధాముని చెరువు(ఐడీఎల్‌)ను సుందరంగా తీర్చిదిద్ధి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత చిరువ్యాపారులకు శాశ్వత ప్రతిపాదికన స్థలం కేటాయించేలా చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. దీంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. చెరువు కట్టపై జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మొదటి విడతగా రూ.18కోట్లతో చెరువు అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. దీనిని మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చబోతున్నామన్నారు. అభివృద్ధి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భం గా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ పగుడాల శిరీష, అధికారులు ఆనంద్‌, నర్సింగ్‌రావు, నాయకులు బాబురావు, శ్రావణ్‌కుమార్‌, ప్రభాకర్‌గౌడ్‌, వెంకటే్‌షచౌదరి, అంబటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

*రాష్ట్రంలో అన్ని వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం బాచుపల్లిలో హిందూస్థాన్‌ ఎరోనాటికల్‌ లిమిటెడ్‌ వారి సహకారంతో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ(సీఎ్‌సఆర్‌)లో భాగంగా రూ. 17కోట్లతో చేపట్టనున్న సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, హైస్కూల్‌ నిర్మాణ పనులకు మంత్రులు ఈశ్వర్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

*సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌(సీఐటియూ) విశాఖ జిల్లా 12వ మహా సభలను విజయవంతం చేయాలని యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌ తెలిపారు. శుక్రవారం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 22, 23 తేదీలలో ఈ సభలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో నాయకులు కె.కుమార మంగళం, జగన్‌, కేఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

*సర్టిఫికెట్‌ వెరిఫికేషన్స్‌, విల్లింగ్‌ పూర్తయినా ఇప్పటి వరకు తమకు ఉ ద్యోగ నియమాకాలు జరగలేదని 1998 క్వాలిపైడ్‌ టీ చర్స్‌ ఆవేదన వ్యక్తం చేశా రు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు స్థానిక ధర్నాచౌక్‌లో శుక్రవారం ధర్నా చేపట్టారు. త మ నియమాకాలకు సంబంధించి వెరిఫికేషన్‌ అయిన 6,852 మందికి నియమాకాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.విశ్వరూపాచారి, కే.శ్రీనివాసరావు, రామాంజనేయరెడ్డి, కిషోర్‌, నారాయణ మహిళా నేతలు నేన్సీ, సుమన జ్యోతి, క్వాలీఫైడ్‌ టీచర్లు పాల్గొన్నారు.

* నకిలీ సర్టిఫికెట్ల ముప్పును అరికట్టేందుకు దేశంలోనే తొలిసారిగా స్టూడెంట్‌ అకడమిక్‌ వెరిఫికేషన్‌ సర్వీస్‌ (ఎస్‌ఏవీఎస్‌) పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సర్టిఫికెట్లను సులభంగా, అత్యంత వేగంగా ఈ పోర్టల్‌ ద్వారా వెరిఫికేషన్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మాసాబ్‌ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి మంత్రి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ… ప్రస్తుతానికి డిగ్రీ, పీజీ విద్యార్థుల సర్టిఫికెట్లను ఈ పోర్టల్లో వెరిఫికేషన్‌ చేసుకోవచ్చని, త్వరలోనే ఇంటర్‌, పదో తరగతి సర్టిఫికెట్లను కూడా వెరిఫై చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. 2010-2021 మధ్యకాలంలో పట్టభద్రులైన 25 లక్షల మంది విద్యార్థుల డేటాను, సర్టిఫికెట్లను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లను అరికట్టడానికి ఈ పోర్టల్‌ దోహదపడుతుందని మంత్రి చెప్పారు.

*క్యాసినో కేసులో ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ ఎల్‌ రమణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విచారణను నిలిపివేసిన అధికారులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. నేపాల్‌లో చీకోటి ప్రవీణ్‌ నిర్వహించిన క్యాసినో కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా లభించిన సమాచారం, ఆధారాల మేరకు పలువురు ప్రజాప్రతినిధులు, వారి బంధువులు, సన్నిహితులకు ఈడీ నోటీసులు జారీ చేసి విచారిస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎల్‌.రమణకు నోటీసులు జారీచేయడంతో.. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఆ సమయంలో హుషారుగానే ఉన్న ఆయన.. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. ఒంట్లో నీరసంగా ఉన్నట్లు చెప్పడంతో అధికారులు ఆయనకు మంచినీరు తాగించి, సహాయకుడి వెంట రమణ కారులోనే హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఎల్‌.రమణ తరచుగా వైద్య పరీక్షలు చేయించుకునే సోమాజిగూడ యశోద ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని నిర్ధారించారు. శనివారం ఆయన్ను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపనున్నట్లు తెలిసింది.
*ఉత్తరాఖండ్‌లోని ఓ ఇంట్లో చంద్రగ్రహణం ఏర్పడిన మర్నాటి నుంచి మంటలు అంటుకుంటున్నాయి. ఈ నెల 8న చంద్రగ్రహణం, ఆ మర్నాడే నేపాల్‌తోపాటు ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది.. ఆ రోజు నుంచి 8 రోజుల్లో 20 సార్లు ఆ ఇంట్లో మంటలు అంటుకున్నాయి. మొదట్లో షార్ట్‌సర్క్యూట్‌ వల్లేమో అనుకుని విద్యుత్‌ కనెక్షన్‌ తీసేయించారు. అయినా సరే మంటలు ఆగక పోవడం మిస్టరీగా మారింది. దీంతో ఆ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాక కుటుంబసభ్యులు భయంతో వ ణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకలేక చివరకు ఇంటినే ఖాళీ చేశారు. విద్యుత్‌ కనెక్షన్‌ తీసివేయించినా కూలర్‌లో మంటలు అంటుకున్నాయని, స్విచ్‌ బోర్డులు, అల్మారా, దుస్తులు కాలిపోయాయని కుటుంబ సభ్యులు వాపోయారు. అయితే ఈ మంటలు ఎందుకు చెలరేగుతున్నాయి? అనే విషయమై అధికారలు పరిశీలన చేస్తున్నారు. భూకంపం వల్ల విడుదలైన వాయువుల వల్లో చంద్రగ్రహణం వల్ల ఏర్పడిన మార్పుల కారణంగా ఇలా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.

*ఈ ఏడాది డిసెంబ‌ర్ 7వ తేదీ నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి ట్వీట్ చేశారు. డిసెంబ‌ర్ 7 నుంచి 29వ తేదీ వ‌ర‌కు పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. 23 రోజుల పాటు జ‌రిగే ఈ స‌మావేశాల్లో ప‌లు బిల్లులు, అంశాల‌పై చ‌ర్చిస్తామ‌న్నారు. నిర్మాణాత్మ‌క చ‌ర్చ కోసం ఎదురుచూస్తున్నామ‌ని పేర్కొన్నారు.

*ఝూన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఝాన్సీలక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి పవన్ నివాళులు అర్పించారు. అన్ని పార్టీ కార్యాలయాలలో 117వ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను వీర మహిళలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘ఝాన్సీ లక్ష్మీబాయి స్పూర్తితోనే మన మహిళా విభాగానికి వీరమహిళ అని పెట్టాం. రాజకీయాలలో పోరాటం చేసే సత్తా ఉన్నవారు వెనుకబడిపోతున్నారు. వీర మహిళలు అండగా లేకపోతే జనసేన పార్టీ లేదు. బాధ్యత కలిగిన మహిళా నాయకులు, మహిళా శక్తి ఉండాలని నేను కోరుకుంటాను. నా కోసమో, పార్టీ కోసమో కాదు సమాజం మార్పు కోసం ఇదంతా చేస్తున్నాను. ఒకటి రెండు అత్యాచారాలు జరిగినా పట్టించుకోవద్దు అనే విధంగా నాయకత్వాలు ఉన్నాయి. మహిళా శక్తితో జనసేన ముందుకు సాగుతోంది’’ అని పవన్ పేర్కొన్నారు

*కేరళ రాష్ట్రం పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan mohan reddy) ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని… యాత్రికులకు తగిన సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి (AP CM)కి అధికారులకు నివేదించారు.ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తుల బృందం మొత్తం 2 బస్సుల్లో 84 మంది ఈనెల 15న శబరిమల వెళ్లారని తెలిపారు. స్వామి దర్శనానంతరం తిరిగి వస్తున్న సమయంలో ఈరోజు ఉదయం బస్సు ప్రమాదానికి గురైందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 44 మంది ప్రయాణింస్తుండగా.. వారిలో 18 మంది గాయపడ్డారన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొట్టాయం మెడికల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. పతనంతిట్ట జిల్లా కలెక్టర్‌తో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు

*చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి మెరుగు నాగార్జున(Minister Merugu Nagarjuna) విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సానుభూతి బెడిసికొట్టినట్లు కనిపిస్తోందన్నారు. అందుకే వికేంద్రీకరణ గురించి ప్రజలు అడుగుతుంటే దిగజారి మాట్లాడడమే కాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను భయపెట్టే స్థాయికి వెళ్తున్నారని.. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. 29 గ్రామాల వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిలబెట్టుకోవడం కోసమే యాత్రలు అంటున్నారని విమర్శించారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏం ఉపయోగపడడం లేదని చెప్పగలిగే దమ్ము చంద్రబాబు(Chandrababu)కు ఉందా? అని నిలదీశారు. ఇక విశాఖపట్నం, తిరుపతికి వచ్చి మూడు రాజధానులు వద్దని చెప్పగలరా? అని అడిగారు. 2024లో కూడా చంద్రబాబు రథచక్రాలు తొక్కి విరగ్గొడతామని చెప్పుకొచ్చారు. పాదయాత్రతో లోకేష్ రాజకీయంగా ఎదగడం ఒక కల అని వ్యాఖ్యానించారు.

*టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా.. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కవితకు వెన్నుపోటు పొడిచింది సొంతపార్టీ ఎమ్మెల్యేలేనని వ్యాఖ్యానించారు. కవిత గెలిస్తే ఆధిపత్యం చేలాయిస్తుందేమోనన్న భయంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆమెను ఓడించారని ఆరోపించారు. కవితను కనపడకుండా చేయాలని చూసింది ఆ పార్టీ ఎమ్మెల్యేలేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లు కవితకు ఎందుకు పడలేదని ప్రశ్నించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో రైతులతో నిజామాబాద్‌లో నామినేషన్ వేయించింది బీజేపీనేనని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ నామినేషన్ వేయిస్తే.. వాళ్లు బీజేపీలో ఎందుకు చేరుతారని జీవన్‌రెడ్డి నిలదీశారు.

*జీఎస్టీ అధికారులమంటూ వ్యాపారులను, నిరుద్యోగులను మోసం చేసి సుమారు కోటీ 20 లక్షలు వసూలు చేసిన ఘటన పేట్‌బషీరాబాద్‌పోలీ్‌సస్టేషన్‌ పరిధి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన నారాయణగౌడ్‌ తన ఐదు వాహనాలను లక్డీకాపూల్‌లోని జీఎస్టీ కస్టమ్స్‌ కార్యాలయంలో అద్దెకు పెట్టాడు. ఆ వాహనాలకు జీఎస్టీ కస్టమ్స్‌ స్టికర్స్‌ అంటించారు. కార్యాలయంలోని కొందరు అధికారులతో ఉన్న పరిచయాలతో మోసాలకు ప్లాన్‌ చేశాడు. కాప్రాకు చెందిన శైలజ (షాలిని)ను జీఎస్టీ కస్టమ్స్‌ కమిషనర్‌గా, విజయ్‌, రాజు, చరణ్‌లు సిబ్బందిగా ఓ టీం ఏర్పాటు చేశాడు. వ్యాపారుల వద్ద కెళ్లి తాను జీఎస్టీ కస్టమ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పరిచయం చేసుకునేవాడు.

*అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఇవాళ డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. ఇటాన‌గ‌ర్‌లోని హోలంగిలో ఆ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ విమానాశ్ర‌యంతో టూరిజంను అభివృద్ధి చేయ‌నున్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సుమారు 645 కోట్ల ఖ‌ర్చుతో డోనీ పోలో విమానాశ్ర‌యాన్ని నిర్మించింది. గంట‌కు 200 ప్ర‌యాణికుల్ని హ్యాండిల్ చేయ‌గ‌ల‌దు. మొత్తం ఎనిమిది చెక్ ఇన్ కౌంట‌ర్లు నిర్మించారు. 2300 మీట‌ర్ల ర‌న్‌వే ఉంది. బోయింగ్ 747 విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుకూలంగా విమానాశ్ర‌యాన్ని నిర్మించారు. డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌తో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మొత్తం మూడు విమానాశ్ర‌యాలు అందుబాటులోకి వ‌చ్చేస్తాయి. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో విమానాశ్ర‌యాల సంఖ్య 16కు చేరింది.

* మహబూబ్‌నగర్‌ జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు అయినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈనెలలోనే కళాశాలను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. డిసెంబర్ నుండి నర్సింగ్ కళాశాలలో తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.