అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనుమరాలు నవోమీ బైడెన్ వివాహం ఘనంగా జరిగింది. వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్లో బైడెన్ తన మనుమరాలి వివాహ వేడుకను నిర్వహించినట్టు పీపుల్ మాగజీన్ వెల్లడించింది. వధువు నవోమీ బైడెన్ గ్రాండ్ పేరెంట్స్ జో బైడెన్, జిల్ బైడెన్, వారి బంధువలు, మిత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో వధూవరులిద్దరూ ఒక్కటయ్యారు.
వధువు నవోమీ బైడెన్, వరుడు పీటర్ నీల్ల ఎంగేజ్మెంట్ 2021లో జరిగింది. ఈ విషయాన్ని వారు ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో తామిద్దరం వివాహం చేసుకోబోతున్నామని ఈ ఏడాది ప్రారంభంలో నవోమీ, పీటర్లు ప్రకటించారు. కాగా, గత దశాబ్దకాలంలో వైట్‌హౌస్‌లో వివాహ వేడుక జరగడం ఇదే తొలిసారి అని పీపుల్ మ్యాగజీన్ వెల్లడించింది.
అంతేగాక, అమెరికా అధ్యక్ష భవనంలో అధ్యక్షుడి మనుమరాలి పెండ్లి జరగడం కూడా ఇదే తొలిసారి అని ఆ మ్యాగీజన్ పేర్కొన్నది. ఈ వివాహ వేడుకలో వధువు నవోమీ తన తల్లి తరఫు వారి సంప్రదాయం ప్రకారం.. తెల్లటి లిల్లీ పూలతో వేదిక మీదకు వచ్చింది. రోజంతా ఉత్సాహభరితంగా వివాహ వేడుక జరిగింది.
వధువు నవోమీ బైడెన్ (28) కొలంబియా యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తిచేసింది. వరుడు పీటర్ నీల్ లా డిగ్రీ పూర్తిచేశాడు. కాగా, వైట్‌హౌస్‌లో చివరిసారిగా 2013లో వివాహ మహోత్సవం జరిగింది. ఆ తర్వాత దాదాపు దశాబ్దకాలం గ్యాప్‌తో ఇప్పుడు అధ్యక్షుడు బైడెన్ మనుమరాలి వివాహం జరిగింది.