గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ప్రముఖ కథానాయకుడు చిరంజీవికిప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ – 2022 (IFFI) పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది. నాలుగు దశాబ్దాలుగా నటుడిగా 150కిపైగా సినిమాలు చేసి ప్రజాదరణ పొందారని, ఆయనది విశిష్టమైన కెరీర్ అని చిరంజీవిని అభినందిస్తూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. గతంలో ఈ అవార్డుని అమితాబ్ బచ్చన్, హేమమాలిని, రజనీకాంత్, ఇళయరాజా తదితర హేమాహేమీలు గెల్చుకున్నారు. అన్నయ్య ఈ పురస్కారానికి ఎంపికవడం పట్ల పవన్‌కల్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవికి కిషన్‌రెడ్డి అభినందన
ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిఆదివారం రాత్రి ఓ ప్రకటనలో అభినందించారు. తెలుగువారితో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి ఈ అవార్డుకు వన్నె తీసుకువచ్చారనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. ‘చిరంజీవి నటప్రస్థానం ఇకపైనా ఇలాగే కొనసాగాలి. సేవా కార్యక్రమాల్ని కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలి’ అని ఆకాంక్షించారు.