Movies

థ్రిల్లింగ్‌గా ఉంది

థ్రిల్లింగ్‌గా ఉంది

అందం, ప్రతిభ కలగలిసిన తారగా హిందీ చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకుంది తాప్సీ. అగ్ర నాయికగా ఎదిగిన తర్వాత మంచి కథలను తెరకెక్కించే ఆలోచనతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిందామె. ఔట్‌సైడర్స్‌ ఫిలింస్‌ సంస్థలో ‘బ్లర్‌’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నది. వచ్చే నెలలో స్ట్రీమింగ్‌ ప్రారంభం కానుంది. నిర్మాతగా తన తొలి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం థ్రిల్లింగ్‌గా ఉందని ఈ సందర్భంగా తాప్సీ చెప్పింది.‘జూలియాస్‌ ఐస్‌’ అనే స్పానిష్‌ ఫిల్మ్‌ రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు అజయ్‌ బాల్‌. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ కథలో ద్విపాత్రాభినయం చేస్తున్నది తాప్సీ. ఆమె డ్యూయల్‌ రోల్‌ చేస్తున్న తొలి చిత్రమిది. ట్విన్‌ సిస్టర్స్‌ కథ ఇది. అనుమానాస్పదంగా మృతి చెందిన తన సోదరి కేసు ఇన్వెస్టిగేషన్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయి క్రమంగా చూపు కోల్పోతుంది. ఆమె అంధత్వానికి కారణం ఏంటి? ఈ పరిస్థితిలో తన సోదరి హత్యకు కారణాలు ఎలా తెలుసుకుంది? అనేది తెరపై ఆసక్తిని పంచనుంది. ఎలాంటి వారసత్వం, తెలిసిన వాళ్ల అండ లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తాప్సీ…కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఔట్‌సైడర్స్‌ ఫిలింస్‌ పేరుతో సంస్థను స్థాపించినట్లు చెప్పుకుంది.